విమానాశ్రయానికి ‘భద్రత’ ఉందా?

15 Oct, 2014 02:51 IST|Sakshi
విమానాశ్రయానికి ‘భద్రత’ ఉందా?
  •  పెను తుపాను వస్తే తప్పని ఇబ్బందులు
  •  అధునాతన టెర్మినల్ భవనం అవసరం
  •  ప్రత్యేక  డిజైన్ సిద్ధం చేస్తున్న అధికారులు
  •  భూములిచ్చేందుకు ఒప్పుకోని రైతులు
  • సాక్షి, విజయవాడ : హుదూద్ సృష్టించిన పెను విలయానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆధారంగా నిర్మించిన  విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం విధ్వంసం కావడంతో... గన్నవరం విమానాశ్రయ పటిష్టతపైనా చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఎయిర్‌పోర్టుకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉందా?  అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

    విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయమే  పెనుగాలుల నుంచి తప్పించుకోలేకపోయిందని, సాధారణ గన్నవరం ఎయిర్‌పోర్టు ఏలా తట్టుకుంటుందనే వాదన వినిపిస్తోంది. అయితే రాజధాని ఎయిర్‌పోర్టు కాబట్టి దీనిని మరింతగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఉంది.   బ్రిటిష్ పరిపాలన సమయం నుంచే   గన్నవరం విమానాశ్రయం ఉంది. అయితే 2000 సంవత్సరం వరకు కేవలం రన్‌వేగానే దీనిని వినియోగించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి మూడు ఎయిర్‌లైన్స్ నాలుగు నగరాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి.

    అయితే పూర్తిస్థాయిలో ఐదేళ్ల నుంచే వాడకంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం సాధారణ నిర్మాణం గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేవలం రన్‌వే వాడకానికి వీలుగా నిర్మించారు. భవనంపై భాగం అంతా రేకులతో నిర్మితమై ఉంది. 574 ఎకరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులో 7,500 అడుగుల రన్‌వే ఉంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్, మధురై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి.

    తాజాగా విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో విఐపీల రాకపోకలు అధికమయ్యాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెం దిన వారే అధికంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి   నెలకు సగటున మూడుసార్లు  వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
     
    సదుపాయాల లేమి...

    మారుతున్న అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు పెరిగాయి కాని సౌకర్యాలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌లో కేవలం 70 మందికి మాత్రమే సీటింగ్ సౌకర్యం ఉంది. అలాగే 7,500 అడుగులు రన్‌వే ఉంది. అలాగే విమానాల  పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏరియా తక్కువే ఉంది. ఈ క్రమంలో రెండు నెలల కిత్రం  ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆలోక్ సిన్హా, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టును సందర్శించారు.

    రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడ రాజధానిగా ప్రకటించనున్న క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే భూసేకరణ అసలు సమస్యగా మారింది. 480 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా వాటిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 430 ఎకరాల భూమిని సుమారు 400 మంది రైతలు నుంచి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తి అయితేనే విస్తరణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే గన్నవరం భూముల ధరలు  కోట్లకు చేరిన  క్రమంలో రైతులు భూములు ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు.
     
    తుపానుల ముప్పు తక్కువే
     - రాజ్‌కిషోర్, డెరైక్టర్
     విశాఖ విమానాశ్రయం సముద్రానికి అతి దగ్గరగా ఉండటం వల్ల కొంత నష్టం వాటిల్లిందని, అయితే గన్నవరానికి  అలాంటి ఇబ్బంది ఉండదని గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ రాజ్‌కిషోర్ సాక్షికి తెలిపారు. సముద్రానికి , నదికి దూరంగా జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో ఇబ్బంది ఉండదని చెప్పారు. అయితే ప్లానింగ్ విభాగం  భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన టెర్మినల్ డిజైన్‌కు రూపకల్పన చేస్తుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు