ఏపీ టూరిజం ప్రచారకర్తలుగా అజయ్ దేవగణ్, కాజోల్

13 Apr, 2016 02:04 IST|Sakshi
ఏపీ టూరిజం ప్రచారకర్తలుగా అజయ్ దేవగణ్, కాజోల్

♦ అమరావతిలో మీడియా సిటీ నిర్మాణానికి ప్రతిపాదన
♦ ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ హీరో భేటీ
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: బాలీవుడ్ నటులు, దంపతులైన అజయ్ దేవగణ్, కాజోల్ రాష్ట్ర పర్యాటక ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అజయ్ దేవగణ్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతి, ఏపీ పర్యాటక రంగానికి తన భార్య కాజోల్‌తో కలసి ప్రచారకర్తలుగా పని చేస్తామని అజయ్ దేవగణ్ ప్రతిపాదించగా చంద్రబాబు సమ్మతించారు. రాజధానిలో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు అజయ్ ఈ సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సిటీ గురించి ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. దుబాయ్ తరహాలో వర్చువల్ టెక్నాలజీ స్టూడియో నిర్మాణాన్ని ఏపీలో చేపట్టనున్నట్లు అజయ్ దేవగణ్ ప్రకటించి నట్లు సీఎం క్యాంపు కార్యాలయం వెల్లడించింది.

 సీఆర్‌డీఏ మ్యాపింగ్‌లో లైడార్ టెక్నాలజీ
 రాష్ట్రంలో లైడార్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఈ టెక్నాలజీని రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి సర్వే ఆఫ్ ఇండియా తరఫున ముందుకొచ్చిన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ స్వర్ణ సుబ్బారావును సీఎం అభినందించారు. సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం ఈ టెక్నాలజీని పరిచయం చేయడానికి త్వరలో సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటిస్తుందని సీఎం చెప్పారు.  

 ఎన్‌ఆర్‌ఐ ఐటీ కంపెనీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
 ఐటీ సేవలపై అమెరికా ఐటీ కంపెనీలతో చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డల్లాస్, షికాగో, న్యూజెర్సీ, హూస్టన్, అట్లాంటా, వాషింగ్టన్ డీసీ నగరాల్లోని వందకుపైగా కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో 400కుపైగా అమెరికన్ ఎన్‌ఆర్‌ఐ ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఐటీ సర్వ్ పేరుతో ఒక కన్సార్టియంగా ఏర్పడినట్లు తెలిపారు. ఏపీకి తరలి రావడానికి 50 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. ఆయా కంపెనీలు కోరిన మేరకు ప్లగ్ అండ్ ప్లే రెంటల్ స్పేస్‌ను రాయితీతో ఇవ్వడానికి, పాక్షికంగా శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులో ఉంచేం దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. సీఎం కార్యాలయానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సేవలు, పెట్టుబడుల సలహాదారు వేమూరు రవికుమార్ ఈ సమావేశం ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

మరిన్ని వార్తలు