‘అవినీతికి ఎమ్మెల్యేలే కారణం’

8 Feb, 2019 14:42 IST|Sakshi

ఏపీ మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లం

సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి కమిటీలు డబ్బు సంపాదన కోసమే ఏర్పాటయ్యాయని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అజయ్‌ కల్లం ఆరోపించారు. డబ్బు కోసం టీడీపీ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌- సేవ్‌ డెమోక్రసీ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి అజయ్‌ కల్లం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్మిక, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్‌ కల్లం మాట్లాడుతూ.. అవినీతి సంస్థాగతంగా వ్యవస్థీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అవినీతికి ఎమ్మెల్యేలే మూలకారణమని అభిప్రాయపడ్డారు.  

పేదల ఇళ్ల నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోందని ఆయన విమర్శించారు. ఏపీలో ఇసుక దోపిడి కోట్లల్లో సాగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచిందన్నారు. సీఎంతో సహా పదవుల్లో ఉన్న వారికి ప్రాజెక్టుల్లో ఆరు శాతం వాటాను కాంట్రాక్టర్లు ఇస్తున్నారని తెలిపారు. అలా సంపాదించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం చూస్తోందని అజయకల్లం దుయ్యబట్టారు.  
 

మరిన్ని వార్తలు