బీజేపీ, టీడీపీ భరతం పడతాం

18 Jul, 2018 08:03 IST|Sakshi
సమావేశానికి హాజరైన విద్యార్థినులు, మాట్లాడుతున్న  విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీరామ్‌గౌడ్

ఎమ్మిగనూరు రూరల్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాబోవు రోజుల్లో బీజేపీ ప్రభుత్వం భరతం పడతామని విద్యార్థి జేఏసీ నాయకుడు శ్రీరామ్‌గౌడ్, సురేంద్ర, కారుమంచి, ధనుంజయ్, రవి, రాజు హెచ్చరించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై చేపట్టిన జీపుజాత మంగళవారం పట్టణానికి చేరుకుంది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో వారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్రుల హక్కు అని, పోరాటాల ద్వారా సాధించి తీరతామని స్పష్టం చేశారు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇవ్వాలంటే ప్రతిపక్షనేతగా ఉన్న వెంకయ్యనాయుడు 15 సంవత్సరాలు కావాలని చెప్పి, గద్దెనెక్కిన తరువాత అందరినీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్లు బీజేపీతో కలసి ఉండి ప్యాకేజీ కోసం హోదా అంశాన్ని తాకట్టుపెట్టాడని మండిపడ్డాడు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హోదా అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ మోసం చేసిందంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి తన సచ్చీలతను నిరూపించుకోవాలని సూచించారు. రాబోవు రోజుల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. ఈ నెల 25న కోటి మందితో మానవహారం చేసి ప్రభుత్వాలకు తమ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు విజేంద్ర, రంగస్వామి, శేఖర్, మహేంద్ర, వీరేష్, రాజీవ్, షమివుల్లా, తిమ్మగురుడు, ఉసేని, నవీన్, గిరి,మహబుబ్, సురేష్, ప్రతాప్, రవితేజ, రాజు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు