అవినీతిలో టీడీపీ రికార్డు పదిలం

13 Jan, 2019 10:09 IST|Sakshi

‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో మాజీ సీఎస్‌ అజేయ కల్లం 

తెలుగుదేశం పార్టీ పాలనలో ఆర్థికంగా రాష్ట్రం వెనుకంజ 

దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ సర్కారు మభ్యపెడుతోంది 

నాలుగున్నరేళ్లలో ఇసుక నుంచి     రూ.40 వేల కోట్లు దోచుకున్నారు 

∙అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు నిత్యం రూ.7.2 కోట్లు 

కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచేశారు 

బడ్జెట్‌లో డబ్బులు లేకున్నా అప్పులు తెచ్చి మరీ దోచేయడం దారుణం 

హౌసింగ్‌ స్కీమ్‌ పేరుతో రూ.18,250 కోట్లు మింగేసేందుకు కుట్ర 

సెట్‌టాప్‌ బాక్సుల కోనుగోలులోనూ కమీషన్ల దందా 

కన్సల్టెన్సీలపై టీడీపీ సర్కారు కాసుల వర్షం 

సాక్షి, గుంటూరు: ప్రభుత్వం ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసినా రాష్ట్రం ఆర్థికంగా వెనుకంజలో ఉందన్న మాట వాస్తవమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అజేయ కల్లం స్పష్టం చేశారు. దేశంలో మనరాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం నిర్వహించిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో అజేయ కల్లం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ  కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. అజేయ కల్లం మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్‌ పనుల్లో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే మరో కాంట్రాక్టర్‌ నాలుగు టన్నులు అదనంగా కాంక్రీట్‌ వేస్తే ఆ రికార్డు చెరిగిపోతుందని, కానీ, అవినీతిలో టీడీపీ ప్రభుత్వం సృష్టించిన రికార్డును మాత్రం ఎవరూ అధిగమించలేరని తేల్చిచెప్పారు.

పౌరసమాజం నాశనం కావడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయని చరిత్ర చెబుతోందన్నారు. అందులో మొదటిది కుటుంబ వ్యవస్థ నాశనం కావడం, రెండోది విద్యా వ్యవస్థ నాశనం కావడం, మూడోది తప్పుడు వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడమని చెప్పారు. అజేయ కల్లం ఇంకా ఏం మాట్లాడారంటే...  ‘‘తమ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేలా, వారికి లాభం చేకూరే పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. దీనివల్ల సమాజంలో అవినీతి వ్యవస్థీకృతంగా మారుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న నీరు–చెట్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకాలు. ఆయా పథకాల పనులను నామినేషన్‌పై జన్మభూమి కమిటీలకు, అధికార పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. వారు సంపాదించుకోవడానికి మాత్రమే ఆ పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఏపీలో 10 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి అందులో 40 శాతం కూడా క్షేత్రస్థాయిలో లేవు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ఆసరా పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పింఛన్ల పంపిణీ బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఎమ్మెల్యే సిఫారసు లేనిదే నేడు రాష్ట్రంలో ఉద్యోగులకు బదిలీలు, పోస్టింగ్‌లు లభించని పరిస్థితి నెలకొంది. నరసరావుపేటలో కేఎస్సార్‌ ట్యాక్స్‌ పేరుతో అధికార పార్టీ నేతలు కూరగాయలు అమ్ముకునేవారిని కూడా వదలడం లేదు. 

గురజాలలో మైనింగ్‌ డాన్‌ ఆర్జన రూ.వెయ్యి కోట్లు 

తెలంగాణలో  నాలుగున్నరేళ్లలో ఇసుక మీద రాయల్టీ రూపంలో రూ.2,000 కోట్లు వచ్చింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో నాలుగు నుంచి ఐదు రెట్లు ఇసుక ఎక్కువ లభ్యమవుతోంది. ఇలా చూస్తే ఏపీ ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ.10,000 కోట్లు రావాల్సి ఉంది. ట్రాక్టర్‌ ఇసుకకు రూ.200 చొప్పున రోజుకు రూ.7.2 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు వెళ్తోంది. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇసుక  తవ్వే కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు రూ.30,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. గురజాల నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి ఇసుక, మైనింగ్‌ రూపంలో వెయ్యి కోట్లు సంపాదించాడు.  

హౌసింగ్‌ స్కీమ్‌లో రూ.18,250 కోట్ల స్కామ్‌ 

హౌసింగ్‌ స్కీమ్‌ పేరుతో జరిగిన కుంభకోణం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తెలంగాణలో 1,000 ఇళ్లు ఒక యూనిట్‌గా తీసుకుని చదరపు అడుగుకు రూ.1,300 చొప్పున వెచ్చించి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణ పనులు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తక్కువ మంది కాంట్రాక్టర్లు ఉంటే కమీషన్లు తీసుకోవడం సులభమని 10,000 ఇళ్లు ఒక యూనిట్‌గా పెట్టి చదరపు అడుగుకు రూ.2,400 చొప్పున వెచ్చించి నలుగురైదుగురికి కాంట్రాక్టులు ఇచ్చారు. ఇవికాకుండా అమృత్‌ పేరుతో చదరపు అడుగుకు వసతుల కల్పన పేరుతో రూ.200 చొప్పున ఖర్చు పెడుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ కన్నా చదరపు అడుగుకు రూ.1,200 అదనంగా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇటీవలే ఈ గృహాల సంఖ్యను 10 లక్షలకు పెంచారు. ఈ లెక్కన 36.5 కోట్ల చదరపు అడుగులకు తెలంగాణకు, ఇక్కడికి ఉన్న రూ.1,200 తేడాలో రూ.500లను అధికార పార్టీ పెద్దలు తింటున్నారని కాంట్రాక్టర్లే చెబుతున్నారు. చదరపు అడుగకు రూ.500 చొప్పున 36.5 కోట్ల చదరపు అడుగులకు రూ.18,250 కోట్లు దోచుకుంటున్నారు. 

సెట్‌టాప్‌ బాక్సుల్లో రూ.2 వేల కోట్లకు ఎసరు 

కేబుల్‌ ఆపరేటర్లను తమ అధీనంలో పెట్టుకుని తమకు అనుకూలంగా లేని చానళ్ల గొంతు నొక్కడం కోసమే ప్రభుత్వం ఫైబర్‌నెట్‌ను తెరపైకి తెచ్చింది. ఈ ఫైబర్‌నెట్‌ కాంట్రాక్టులను కూడా అనర్హులకే కట్టబెట్టారు. రూ.300 కోట్లతో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు పూర్తవుతుందని తొలుత చెప్పిన ప్రభుత్వం తర్వాత ఈ వ్యయాన్ని రూ. 1100 కోట్లకు పెంచేసింది. ఒక్కో సెట్‌టాప్‌ బాక్సు రూ.1200–1500లకు లభిస్తుండగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం కమీషన్ల కోసం ఒక్కో బాక్స్‌కు రూ.4,000 కేటాయించి, వారికి సంబంధించిన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టారు. దోచుకున్నది చాల్లేదని, రూ.2,000 కోట్లు దోచుకోవడం కోసం 10 లక్షల బాక్సులు సరిపోవని 64 లక్షల సెట్‌టాప్‌ బాక్సుల కొనుగోలుకు ఇటీవలే జీవో విడుదల చేశారు. 

ప్రాజెక్టుల కోసం రూ.35 వేల కోట్ల అప్పు: ప్రభుత్వం రూ.50,000 కోట్లతో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు చేపడితే అందులో రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల సొమ్ము సీఎం, మంత్రులకు వెళుతోంది. రూ.2.20 లక్షల కోట్ల అప్పు ఉందని ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రకటించిన ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం బడ్జెట్‌లో డబ్బు లేకపోయినా వివిధ కార్పొరేషన్‌లు, సంస్థలకు గ్యారంటీగా ఉండి రూ.35,000 కోట్ల అప్పు తెచ్చినట్టు చెప్పింది. 

అన్నింటికీ కన్సల్టెన్సీలే అయితే ఉద్యోగులెందుకు? 

నాలుగు, ఆరు లైన్ల జాతీయ రహదారులు పక్కాగా వేయడానికి కేంద్రం కిలోమీటర్‌కు రూ.26 కోట్లు అత్యధికంగా టెండర్లు పిలుస్తుంటే, అమరావతిలో రోడ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కి.మీ కి రూ.36 కోట్లకు టెండర్లు పిలిచింది. కన్సల్టెన్సీ చార్జీల పేరుతో నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించిన సొమ్ము గత 70 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు చెల్లించినదానికంటే ఎక్కువ. కన్సల్టెన్సీ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించింది. అన్ని పనులను కన్సల్టెన్సీలకే అప్పగిస్తూ చార్జీలు చెల్లిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇక ఉద్యోగులు ఎందుకు?’’ అని అజేయ కల్లం ప్రశ్నించారు.

కమీషన్ల కోసమే అంచనా వ్యయం పెంపు 

నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2014లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రమే. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలుపెట్టి నిర్మాణంలో ఉన్న 23 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014లో ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో రూ.52,000 కోట్లు ఖర్చుపెట్టామని చెప్పింది. రూ.17,000 కోట్ల అంచనా వ్యయాన్ని కేవలం కమీషన్ల కోసం రెండు నుంచి మూడు రెట్లు పెంచేసి దర్జాగా దోచేస్తున్నారు. బడ్జెట్‌లో డబ్బులు లేకున్నా అప్పులు తెచ్చి మరీ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి దోచుకోవడం దారుణం. 

కావాల్సిన వారికే ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్టు!

భోగాపురంలో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెక్నికల్‌ బిడ్‌లలో రెండు కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ఒకటి ప్రభుత్వ కంపెనీ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, రెండోది జీఎమ్మార్‌. టెక్నికల్‌ బిడ్‌లో అర్హత సాధించిన అనంతరం ఫైనాన్షియల్‌ బిడ్స్‌ పిలిస్తే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ రెవెన్యూలో 30.2 శాతం ఇస్తామని చెప్పగా, జీఎమ్మార్‌ 21.6 శాతం ఇస్తామని బిడ్‌లో తెలిపింది. ప్రభుత్వ కంపెనీ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నుంచి కమీషన్లు గుంజడం కుదరదనే ఉద్దేశంతో ఎలాగైనా జీఎమ్మార్‌కు టెండర్‌ కట్టబెట్టాలని కుట్రపన్నారు. చిన్నచిన్న కారణాలు చూపించి కేబినెట్‌లో పెట్టుకుని ఆ టెండర్‌ రద్దు చేశారు. 

మరిన్ని వార్తలు