‘గత ఒప్పందాల ఫలితమే పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు’

27 Jun, 2020 17:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా గ్రామస్థాయి నుంచి పటిష్టమైన వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్‌ ఛార్జీలు, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఉద్యోగ నియామాకాల్లో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా నామినేటెడ్‌ పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైరారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం తీసుకొచ్చామన్నారు. రివర్స్‌ టెండంరింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ.2,072 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. 

వద్దన్నా విద్యుత్‌ అంటగడుతున్నారు
‘విద్యుత్ టారిఫ్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధర రూ.7.65ల టారిఫ్ గత ప్రభుత్వమే నిర్ణయించింది. మా ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. కేంద్రం రూ.2.70పైసలకే యూనిట్ విద్యుత్ ఇస్తుందని కేంద్రమంత్రి చెప్పడం అవాస్తవం. ఎన్టీపీసీ రూ.9.84పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తోంది. వద్దన్నా ఈ విద్యుత్‌ను ఏపీకి అంటగడుతున్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ట్రాన్స్‌మిట్ చేసినందుకు ఏపీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం వారు విద్యుత్ తీసుకుంటున్నా ట్రాన్స్‌మిషన్ చార్జీలు మనం చెల్లించాల్సి వస్తోంది.

గత ఒప్పందాల వల్లే పెరిగిన విద్యుత్‌ ధరలు
కేంద్రానికి ఏడాదికి ట్రాన్స్‌మిషన్ చార్జీలే రూ.1700కోట్లు ఏపీ చెల్లిస్తోంది. కేంద్రం చేసిన ఒప్పందాలను ఇప్పటి వరకు ఎక్కడా ఏపీ ఉల్లంఘించలేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీకి బొగ్గుగనులు కేటాయించలేదు. ప్రత్యేక బొగ్గు గనుల కేటాయింపులు లేకపోవడం వల్ల ఏడాదికి రూ.2,500కోట్లు అదనంగా ఏపీ చెల్లించాల్సి వస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చేసిన కొన్ని ఒప్పందాల వల్లే ఏపీలో విద్యుత్ ధరలు పెరిగాయి. 2014లో అన్ని విద్యుత్ సంస్థల అప్పు కలిపి రూ 24,800 కోట్లు.. నేడు అది 70,000 కోట్లకు పెరిగింది. అవినీతి, తప్పుడు ఒప్పందాల వల్లే ఈ అప్పులు ఇంతగా పెరిగాయి. ఈ అప్పులకు వడ్డీలు కట్టడం వల్ల కూడా విద్యుత్ చార్జీలపై ప్రభావం పడుతోంది. గత ప్రభుత్వం వెళుతూ రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు పెట్టింది’అంటూ అజేయ కల్లం వివరించారు. 

మరిన్ని వార్తలు