‘అమరజీవి’ అక్కినేనిని మరువలేం

23 Jan, 2014 04:49 IST|Sakshi
‘అమరజీవి’ అక్కినేనిని మరువలేం

తిరుపతి, న్యూస్‌లైన్ :  మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు తిరుపతితో ఎంతో అనుబంధముంది. బుధవారం పొద్దున నిద్ర లేవగానే ఆయన మరణించినట్లు టీవీల్లో  చూసి తెలుసుకున్న వారు నిర్ఘాంతపోయారు. తిరుపతి ఫిలిం సొసైటీ కార్యాలయం లో సభ్యులు సమావేశమై అక్కినేని మృతికి సంతాపం ప్రకటించారు. తిరుపతితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పలు నాటక, సాం స్కృతిక సంస్థలు అక్కినేని మృతికి సంతాపం ప్రకటించాయి.
 
భాషా బ్రహ్మోత్సవాలకు..

 
అక్కినేని నాగేశ్వరరావుకు తిరుపతితో మరచిపోలేని అనుబంధం ఉంది. భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడు 2006లో మహతిలో నిర్వహించిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు సభకు అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. అప్ప ట్లో ఆ మహానటుణ్ణి చూడడానికి తరలివచ్చిన అభిమానులతో మహతి కిక్కిరిసిపోయింది. అదే సమయంలో తెలు గు వికాస వేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ తర్వాత 2007లో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి సైతం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల గురించి చక్కటి సందేశాన్ని అందచేశారు. అంతకు ముందు 2005లో ఒకసారి తిరుపతిలో జరిగిన తిరుపతి ఫిలిం సొసైటీ రజతోత్సవాలకు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు.
 
ఎస్వీయూలో గోల్డ్ మెడల్
 
యూనివర్సిటీ క్యాంపస్ : సినీనటులు అక్కినేని నాగేశ్వరరావుకు ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన ఎస్వీ యూనివర్సిటీకి శాశ్వత అకడమిక్ సెనేట్ సభ్యులు. అక్కినేని పేరుతో కామర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ నెలకొల్పారు. ఎంకాంలో మొ దటి ర్యాంకు పొందిన విద్యార్థికి ఈ గోల్డ్‌మెడల్‌ను ప్రదానం చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మృతి తెలుగుకళామతల్లికి తీరనిలోటని వీసీ రాజేం ద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఉన్న సినీ నటి అంజలీదేవి మరణించిన వారానికే అక్కినేని మరణించడం బాధాకరమని తెలిపారు. అక్కినేని మృతికి సం తాపం తెలిపినవారిలో విక్రమసింహపురి యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ వి.నారాయణరెడ్డి, కే.రాజారెడ్డి, తిరుపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకరరెడ్డి, మీడియా డీన్ పేటశ్రీ, టెక్నీషియన్ గాంధీబాబు ఉన్నారు.
 
 చాలా నిరాడంబరులు
 తెలుగు భాషా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు అక్కినేనికి ఫోన్ చేశాం. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి తిరుపతికి రావడానికి అంగీకరించారు. ఎగ్జిగ్యూటివ్ క్లాస్‌లో విమానం టికెట్ బుక్ చేస్తామంటే సున్నితంగా తిరస్కరించారు. గంట సేపు ప్రయాణానికి మామూలు క్లాస్ చాలని చెప్పారు. ఇది ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం. అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటుడే కాదు, గొప్ప మానవతావాది.. ఆయన సంస్కృతి సంప్రదాయాలతో బాటు మానవీయ విలువలను ఎక్కువగా గౌరవించేవారు. ఆయన        
 -సీ. శైలకుమార్, చీఫ్ ఎడిటర్, సప్తగిరి
 
 ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే
 తెలుగును అమితంగా అభిమానించే మహానటుడు నాగేశ్వరరావును గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితం ఆదర్శప్రాయమైనది. తెలుగు సినీ పరిశ్రమ తెలుగుగడ్డపైనే ఉండాలని భావించి చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలి రావడానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయమైనది. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు రాష్ట్రానికి తీరని లోటు. రెండు సార్లు తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సమాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేసిన ప్రసంగాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.
 -  భూమన కరుణాకరరెడ్డి
 

మరిన్ని వార్తలు