ఇక్కడా పదిలం

23 Jan, 2014 04:33 IST|Sakshi

ఏయన్నార్...తెలుగువారి గుండెలపై చెదిరిపోని పచ్చబొట్టు. గుర్తుకు వచ్చినప్పుడల్లా హుషారైన ‘దసరా బుల్లోడు’. వయోబేధాలతో పనిలేకుండా అందర్నీ మెప్పించిన ‘ఆత్మీయుడు’. ఎందరితోనో ఆయనకు ‘వి‘చిత్ర’బంధం’. ముచ్చటగా మూడు తరాల వారికి అక్కినేని ‘సూత్రధారి’. ఇలా పాలమూరు జిల్లావాసులతోనూ ఆ మహానటుడు అనుబంధాన్ని పంచుకున్నాడు. రెండుమార్లు ఈ ప్రాంతాన్ని వేర్వేరు సందర్భాల్లో సందర్శించాడు. ఇక సినీరంగం వారితోనూ, ఎగ్జిబిటర్లతోనూ సంబంధాన్ని కొనసాగించారు. అభిమాన సంఘాలవారైతే ఏటా ఆయన పుట్టినరోజునాడు వెళ్లి కలిసేవారు. ఆ జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ ఆయన అభిమానులు కంటతడిపెడుతున్నారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ ‘బుద్ధిమంతుడు’ తమ హృదుల్లో ఎప్పుడూ సజీవుడే అని చెప్తున్నారు.
 
 విభిన్న పాత్రలను పోషించి వెండితెర వేల్పుగా  అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ‘అందరికి టాటా...గుడ్‌బై...ఇంక సెలవు’ అంటూ ఈ లోకాన్ని వీడారని  తెలియడంతో బుధవారం జిల్లాలో ఆయన అభిమానులు, ఆయనతో అనుబంధం  ఉన్నవారు కన్నీటి సాగరంలో మునిగారు.  తొలితరం హీరో అక్కినేని మరణం యావత్ ప్రేక్షక లోకాన్ని కుదిపేసింది.  
 - న్యూస్‌లైన్, పాలమూరు, మహబూబ్‌నగర్ (కల్చరల్)
 
 ఇది 47 ఏళ్లకిందటి
 మాట...
 ఆయన ఒకే ఒక్కసారి పాలమూరు పట్టణానికి విచ్చేశారు. 1967 సంవత్సరంలో ఆయన కథానాయకుడుగా నటించిన పూలరంగడు సినిమాను ప్రదర్శిస్తున్న ఒకప్పటి అశోక్ థియేటర్‌ను అప్పట్లో సందర్శించారు. సినిమాను వీక్షిస్తున్న ప్రేక్షకులను తనదైన శైలిలో పలకరించి వెళ్లారు.  ఆయన రాక తమకెంతో సంతోషాన్ని కలిగించిందని, తాము బ్రతికున్నంత కాలం ఆయనను మదిలో గుర్తుంచుకుంటామని  పలువురు అభిమానులు ఆ రోజును గుర్తుచేసుకున్నారు.
 
 30 ఏళ్ల కిందట గద్వాలకు
 వచ్చిన అక్కినేని
 గద్వాల, న్యూస్‌లైన్ :  ‘ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం గద్వాలకు వచ్చారు. ఇక్కడ కొత్తగా నిర్మాణమైన శ్రీనివాస థియేటర్ ప్రారంభోత్సవానికి 3 ఫిబ్రవరి 1983 రోజున వచ్చారు. ఈ థియేటర్‌లో మొదటి ప్రారంభోత్సవ చిత్రంగా ఆయన నటించిన ప్రేమాభిషేకం సినిమాను ప్రదర్శించారు. వెంకటేశ్వర సినీ ఫైనాన్స్, నిర్మాతగా వ్యవహరిస్తున్న గద్వాల వెంకట్రామిరెడ్డి సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలతో నాగేశ్వరరావును గద్వాలకు ఆహ్వానించారు. అప్పుడు మా అందరితో ఆయన ఆప్యాయంగా మాట్లాడడం ఇప్పటికీ గుర్తుంది. అలాంటి ఉన్నత వ్యక్తి మృతి మమ్మల్ని కలచివేసింది’ అని థియేటర్ నిర్వాహకులు రాజవర్ధన్‌రెడ్డి, మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డిలు  అన్నారు.
 
 ఏడోతరగతిలోనే ఆయనను కలిశాను..!
 నేను స్థానిక మోడల్‌బేసిక్ ఉన్నత పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నపుడు 1977 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వర్‌రావును కలిసే అవకాశం దక్కింది. మా పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడు, 8 మంది విద్యార్థులం కలిసి రేడియో స్టేషన్‌లో పాటలు పాడేందుకు వెళ్లాం. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత మా బృందం అంతా కలిసి అక్కినేని నివాసానికి వెళ్లాం. ఆ చిన్న వయసులోనే ఆయనను కలిసే అవకాశం వచ్చింది. మా నాన్నకు అక్కినేని సన్నిహితులు కావడం.. ఆయన సినిమాల పట్ల నాకున్న అపరిమితమైన అభిమానం కారణంగానే నేను జిల్లా కేంద్రంలో థియేటర్‌లు నెలకొల్పాలన్న అభిప్రాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో జరిగిన పలు సినిమా వేడుకల్లో అక్కినేని నాగేశ్వర్‌రావుతో కలిసే అవకాశం దక్కింది.
 - గుద్దేటి శివకుమార్, సినిమా థియేటర్ల యజమాని
 
 మరపురాని సృ్మతి..!
 నటనలో ఆయనకు ఆయనే సాటి. గంగోత్రి పేరిట ఆరునెలల క్రితం లయన్స్‌క్లబ్ రీజినల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో  హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా..  సత్కరింపబడటం నాకు మరపురాని సృ్మతి. కాలధర్మం చెందిన అక్కినేనికి నివాళి. 1990-96 వరకు నేను ఫిల్మ్‌ఛాంబర్ సభ్యుడిగా కొనసాగాాను. ఎన్నో సినిమా వేడుకల్లోనూ ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అంతకు పూర్వం నాగర్‌కర్నూల్‌లో మా నాన్నగారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రవీంద్ర థియేటర్‌లో అక్కినేని సినిమాలు ఎక్కువగా ప్రదర్శించే వాళ్లం. ఆయన మనవడు సుమంత్ హీరోగా నటించిన తొలి చిత్రం ప్రారంభోత్సవ వేడుక లోనూ అక్కినేనిని కలిసే అవకాశం దక్కింది. ఆయనతో నాది మరపురాని అనుబంధం.
 - ఎ.నటరాజ్, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్‌ఛైర్మన్
 
 ప్రేమ స్వరూపుడు
 షాద్ నగర్, న్యూస్‌లైన్: నా దృష్టిలో అక్కినేని మంచి నటుడే కాదు. సమాజానికి మార్గదర్శకుడు కూడా. సమయాపాలన, విధి నిర్వహణ, అంకితభావం మొదలైనవి ప్రాణపదంగా భావించేవారు అక్కినేని నాగేశ్వరరావు. తరతరాల యువతకు భవితకు బంగారుబాటలు పరిచిన మంచి మనసున్న ఓ మనోవైజ్ఞానికుడు కూడా. అలాంగటి మహోన్నతమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని భాషపైన పట్టు, భావ ప్రకటన, హుందాతనం, గాంభీర్యతను నాలో పెంపొందించుకొని నా ఆధ్యాపక వృత్తికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తున్నాను. అక్కినేనితో నాకు పుష్కరకాలంగా ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. వారి చేతుల మీదుగా హాస్యచక్ర బిరుదును అందుకున్నాను. వారికి బెల్లంతో చేసిన జిలేబిలు అంటే ఎంతో మక్కువ. ఎప్పుడు అక్కినేనిని కలవడానికి వెళ్లినా వాటిని  తీసుకు వెళ్లేవాడిని. అక్కినేని మన మధ్య లేకపోయినా ఆయన మిగిల్చిన మధురసృ్మతులు మనమధ్యే ఉంటాయి.
    - రాధాకృష్ణ, తెలుగు ఉపాధ్యాయుడు, షాద్‌నగర్
 
 ప్రతీ పుట్టినరోజుకు వెళ్లేవాడిని
 ఏటా సెప్టెంబర్ 20వ తేది వచ్చిం దంటే మాకు పండుగరోజులా ఉం డేది.. ఆరోజు ఉదయాన్నే హైదరాబాద్‌కు వెళ్లి అక్కినేని నాగేశ్వర్‌రావును కలిసిన తర్వాతే మాకు సంతృప్తి కలి గేది. అలా.. దాదాపు 44 ఏళ్లుగా ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని నేను ఎప్పటికప్పుడు చాటుకునే వాడిని. 1970లో నటరాజ్ థియేటర్ ఏర్పాటు చేసిన నాటి నుంచి అక్కినేని అభిమానిని. అయితే 1976లో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి అభిమానుల సంఘం లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాను. నాగేశ్వరరావు పుట్టి న రోజునాడు హైదరాబాద్‌కు వెళ్లేవాళ్లం.. చాలా ఏళ్లుగా నేను అక్కినేని అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఆయన చనిపోయారని తెలిసినప్పటి నుంచి అన్నం సహించడంలేదు. మా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నోసార్లు ఆయన్ను కలిసాను.  అంత్యక్రియలకు మేమంతా హాజరవుతున్నాం.
 - అబ్దుల్ ఖాదర్,
 
 అక్కినేని అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు
 గొప్ప భావాలున్న వ్యక్తి
 అక్కినేని సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. భవిష్యత్ తరాలవారందరికీ ఆయన ఆదర్శం. నటుడిగా కన్నా.. గొప్ప భావాలున్న వ్యక్తిత్వం అక్కినేనిది. ఇరవై ఏళ్లకిందట హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమంలో చేపట్టిన లయన్స్‌క్లబ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఆ కార్యక్రమంలో అక్కినేని ప్రసంగిస్తూ.. ప్రతీ మనిషికి ఆత్మబలం గొప్పదని, దృఢ సంకల్పం కలిగిన మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
 - సత్తూరు రాములుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు.
 
 చిత్రసీమకు పెద్దవాడు
 సహజనటుడు, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించడమే కాకుండా నటన ద్వారా అభిమానులకు దిశా నిర్దేశం చూపిన మహా నటుడు నాగేశ్వరరావు సినిమాలంటే కుటుంబ కథాంశాలతో ముడివడి ఉంటుందని చూసేవాళ్లం. ఆయనలేని లోటు చిత్రసీమకు  తీరనిలోటు.
 - బుర్రి వెంకట్‌రాంరెడ్డి, కళాపోషకుడు
 

మరిన్ని వార్తలు