‘అల'జడి

12 Oct, 2014 00:18 IST|Sakshi
‘అల'జడి

రేపల్లె:
 తీరంలో శనివారం ‘అల'జడి రేగింది. పెను తుపానుగా మారిన ‘హుదూద్' ప్రభావం సముద్ర తీరంలో స్పష్టంగా కనిపించింది. నిజాంపట్నం వద్ద సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. నాలుగుమీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సాధారణ రోజుల కంటే భిన్నంగా మరింత ఎత్తుకు అలలు లేస్తుండడం కలకలం రేపుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగానే ఉంటున్నారు.

     నిజాంపట్నం ఓడరేవులో మూడవ నంబర్ ప్రమాద సూచీ ఎగురవేశారు. మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లు ఒడ్డుకు చేరేలా మత్స్యకారులకు సమాచారం అందజేశారు.
     నిజాంపట్నం హార్బర్‌లోని 151 మెక్‌నైజ్డ్ బోట్లలో శనివారం నాటికి 147 ఒడ్డుకు చేరాయి. మరో నాలుగు బోట్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాటి కోసం అధికారులు,బోటు ఓనర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు.
  తుఫాన్ ప్రభావంతో శనివారం మధ్యాహ్నాం నుంచి రేపల్లె, నిజాంపట్నం,బాపట్ల ప్రాంతాల్లో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. రాత్రికి గాలులు వేగం మరింత పెరిగింది.
  సముద్రం నాలుగు మీటర్ల మేర ముందుకు రావటంతో తీర ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
  విశాఖ వద్ద తీరం దాటినా ఆ ప్రభావం గుం టూరు జిల్లాపై కూడా ఉంటుందనే హెచ్చరికలు తీరప్రాంత వాసుల్లో కలకలం రేపుతున్నాయి.
  తుఫాన్ ప్రభావం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా క్షణాల్లో అన్ని చర్యలు తీసుకునే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
  అదే విధంగా ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాం తాల్లో అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
 బోట్లను జాగ్రత్త చేసుకునే పనిలో మత్స్యకారులు...
 ఒడ్డుకు చేరిన బోట్లను జాగ్రత్త చేసుకోవటంతో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. బోట్లను నిలుపుకునేందుకు సరిపడ జెట్టీ లేకపోవటంతో రేవుల ఒడ్డున నిలుపుకుని తాళ్లతో ఒడ్డున ఉన్న చెట్లకు కడుతున్నారు. దీంతో పాటు ఎంతో విలువైన ఐలు వలలను జాగ్రత్త చేసుకుంటున్నారు.
 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్దం
 కొత్తపేట: పెను తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యలు నిమిత్తం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్.ఎం.క్యూ జిలాని వెల్లడించారు. శనివారం జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అందించాల్సిన ర క్షక సహాయక చర్యలన ఆయన సమీక్షించారు.
  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు  జిల్లాలోని బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, తెనాలి ప్రాంతాల్లో  తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.
  బాపట్లకు మూడు బృందాలు, రేపల్లెకు మరో మూడు బృందాలను సిద్ధం చేశామన్నారు. మొత్తం 30 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిపాటు లీడింగ్ ఫైర్‌మెన్లు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
 జిల్లా కలెక్టర్ ఆదేశాలు
 గుంటూరు ఈస్ట్: తుఫాన్ ప్రభావంతో కురిసే భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలకు నష్టం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు.  నిజాంపట్నం ఓడరేవులో మూడవ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు.
  లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలన్నారు.భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని జనరేటర్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పక చేయాలని ఆదేశించారు.
  ఆరోగ్య శాఖ అధికారులు పునరావాస శిబిరాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
  రెవెన్యూ అధికారులు శిబిరాలలోని ప్రజలకు మంచి ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
  పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని కోరారు.
  జాయింట్ కలెక్టర్ శ్రీధర్ జిల్లా రిలీఫ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు.
  తుఫాన్ అనంతరం పంటలు, ఇళ్లు, ఇరిగేషన్, విద్యుత్ వ్యవస్థల నష్టాలను కచ్చితంగా అంచనా వేయాలని కోరారు.
  నీలం తుపాను వచ్చిన సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని సమర్థం ప్రణాళికాలు సిద్ధం చేసుకుని ఆమేరకు పనిచేయాలనికోరారు.
  అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు జిల్లా అధికారులతో సంప్రదించి సహాయం తీసుకోవాలని సూచించారు.
  ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి సరఫరా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
  తహశీల్దారులు అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేసి నష్ట నివారణకు కృషి చేయాలని కోరారు.
 అనధికారిక లేఅవుట్‌లపై చర్యలు....
  జిల్లాలో అనధికారిక రియల్ ఎస్టేట్ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవా లని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
  జన్మభూమి కార్యక్రమాలు ఉన్నా ఈ ప్రక్రియను అమలు జరపాలన్నారు.
  కృష్ణానది మొదలు అన్ని ప్రాంతాల్లో అనుమతి లేని లే అవుట్ల వివరాలు గ్రామ పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి తీసుకోవాలన్నారు.
  ల్యాండ్ కన్వర్షన్, అప్రూవల్ లేని ఏ ఒక్క వెంచర్‌నీ అనుమతించవద్దని తీవ్రంగా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు