పరిశ్రమ యాజమాన్యానికే మంత్రి మేలు

15 Nov, 2018 07:14 IST|Sakshi
అలజంగి జోగారావు

వైఎస్సార్‌ సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త  జోగారావు  

ప్రజాసంకల్పయాత్ర బృందం: ఎన్‌సీఎస్‌ చక్కెర పరిశ్రమ యాజమాన్యానికి మేలు చేకూర్చే విధంగా బాధ్యత గల మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు వ్యవహరించడం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు విమర్శించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం తామరఖండి వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. చక్కెర పరిశ్రమ పరిధిలో చెరకు పండిస్తున్న రైతులకు యాజమాన్యం రూ.11కోట్లకు పైగా ఉన్న బకాయిలను చెల్లించడం లేదన్నారు. రైతుల పక్షాన నిలబడి పరిశ్రమ యాజమాన్యం నుంచి బకాయిలు ఇప్పించాల్సిన మంత్రి సుజయ్‌ యాజమాన్యానికి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు రైతుల పట్ల మమకారం లేదన్నారు. నియోకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజలు పాదయాత్రకు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. సీతానగరం పాత బ్రిడ్జి తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.100కోట్లు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని చెప్పారు. జంఝావతి, తోటపల్లి, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టుల ద్వారా అదనపు ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు