-

మద్యం సిండికేట్ల దోపిడీ!

25 Apr, 2015 01:38 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని మద్యం సిండికేట్లు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. మరో రెండు నెలల్లో లెసైన్స్‌ల గడువు ముగియనుండటంతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నాయి. అధికార టీడీపీ నేతలు, ఎక్సైజ్ అధికారుల అండదండలతో మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నాయి. మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.25, బీరు బాటిల్‌పై రూ.45 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. విచ్చలవిడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసి దందా సాగిస్తున్నాయి. అడ్డు తగులుతారనుకున్న ఒకరిద్దరు అధికారులకు ఎమ్మెల్యేలు, మంత్రులతో హెచ్చరికలు ఇప్పిస్తూ తమ జోలికి రాకుండా చూసుకుంటున్నాయి.
 
 అక్రమార్జనలో అధికారులకు వాటా..
 మద్యం సిండికేట్ల వద్ద చాలామంది ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుని వారికి సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కొందరు అధికారులు మరో అడుగు ముందుకేసి అధిక ధరలకు విక్రయించటం వల్ల వచ్చే లాభాల్లో వాటా ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల గుంటూరు, తెనాలి, నరసరావుపేట మద్యం డిపోలపై ఐటీ అధికారులు దాడులు చేసి గోదాములను సీజ్ చేసిన విషయం తెలిసిందే. మద్యం సిండికేట్లు దీన్ని సైతం తమకు అనుకూలంగా మలచుకున్నాయి. వేసవిలో మందుబాబులు ఇష్టంగా తాగే బీరుకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎమ్మార్పీ కంటే రూ.45 వ రకు అదనంగా వసూలు చేస్తున్నాయి.
 
 కొనసాగుతున్న బెల్టు షాపులు
 జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో 317 లెసైన్స్‌డ్ దుకాణాలు కాగా 15 దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మరో పది ఖాళీగా ఉన్నాయి. మద్యం దుకాణాల లెసైన్స్‌ల గడువు జూన్ నెలాఖరుతో ముగియనుండటంతో ఇదే అదనుగా వ్యాపారులు బెల్టుషాపులను విస్తరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో క్వార్టరు బాటిల్‌పై పది నుంచి 20 రూపాయల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో క్వార్టర్ బాటిల్‌పై రూ.25 వరకు పెంచి విక్రయిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 70 వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు.
 
 జిల్లాలో దాదాపు 900 బెల్టుషాపులు ఉన్నట్లు అంచనా. ఎక్సైజ్ డీసీ కార్యాలయానికి  కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడికొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసినా ఎక్సైజ్ ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

మరిన్ని వార్తలు