తర్జన భర్జన! 

28 Jun, 2019 08:18 IST|Sakshi

సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం పాలసీలతో ఏర్పాటు కాబడిన మద్యంషాపుల గడువు ఈనెలాఖరుతో ముగియనున్నది. కొత్త మద్యం పాలసీ అమలుకావడానికి ఆలస్యం కానుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మద్యంషాపును సెప్టెంబరు 30 వరకు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే మళ్లీ షాపులను కొనసాగించడానికి లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకునే విషయంలో వ్యాపారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయంలో ముందుకు వెళ్లడమా? వ్యాపారం విరమించుకోవడమా అనే అంశంపై మద్యం వ్యాపారులు తలమునకలవుతున్నారు.

షాపులు తగ్గుముఖం 
దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా 20శా తం మద్యం దుకాణాలు తగ్గిస్తామని సీఏం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మ ద్యంషాపులు తగ్గుముఖం పట్టనున్నాయి. మద్యం షాపుల తగ్గింపుపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనను ప్రజా, మహిళాసంఘాలు అభినందిస్తున్నాయి. 

దశలవారీ మద్యనిషేధం 
దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నది. ఈమేరకు కసరత్తు చేస్తోంది. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా మద్యంషాపులు తగ్గించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అక్టోబరు1 నుంచి ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా రిటైల్‌ మద్యంషాపులు నిర్వహిస్తామని ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి సాంబశివరావు మంగళవారం వెల్లడించారు. 
లైసెన్స్‌ రెన్యూవల్‌ 
అదనంగా మూడునెలలు మద్యం విక్రయాలు నిర్వహించడానికి మద్యం దుకాణాల యజమానులు లైసెన్స్‌ ఫీజుతోపాటు, పర్మిట్‌రూం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు శ్లాబుల్లో మద్యం దుకాణాల నుంచి లైసెన్స్, పర్మిట్‌ రూమ్‌ ఫీజులు వసూలు చేయనున్నది.

రెన్యూవల్‌కు వెనుకడుగు..
జిల్లాలో 210కిపైగా మద్యంషాపులు, 20బార్లు ఉన్నాయి. మద్యం సరఫరా చేసే డిపోలు రెండు ఉన్నాయి. నెలకు రూ.10 నుంచి రూ.15కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి 50శాతం ఆదాయం వస్తోంది. షాపుల కొనసాగింపు చేపట్టిన క్రమంలో మద్యంషాపుల నిర్వాహకులు ఎమ్మార్పీ ఉల్లంఘించినా, నిర్ణీతవేళకు మించి మద్యం విక్రయించినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నిబంధనలు అతిక్రమించి ధనార్జనకు అలవాటుపడిన మద్యంషాపుల నిర్వహకులపై ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడునెలల రెన్యూవల్‌కు అవకాశం కల్పించినా నిర్వాహకులు ముందుకు రావడానికి జంకుతున్నారు. 

ససేమిరా 
ప్రభుత్వం బెల్టుషాపుల నిర్వహణకు ససేమిరా అంటుండడంతో అనధికార ఆదాయానికి అలవాటుపడిన వారు లైసెన్స్‌ రెన్యూవల్స్‌ చేయిం చుకుంటే తమ ఆటలు సాగవనే అభిప్రాయంలో ఉన్నారు. కాగా దశలవారీ మద్యనిషేధంలో భాగంగా బెల్టుషాపుల సమూల నిర్మూలనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెల్టుషాపులకు మద్యం రవాణా చేసే షాపుల లైసెన్స్‌లను సైతం రద్దు చేసి కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ బెల్టుషాపుల నిర్మూలనకు నడుంబిగించింది. అక్టోబరునెలకంతా బెల్టుషాపుల వాసన ఉండకూడదని కలెక్టర్‌లు, ఎస్పీలకు సైతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు