మద్యం.. పండగ దోపిడీ

15 Jan, 2019 08:24 IST|Sakshi

గగ్గోలు పెడుతున్న మందుబాబులు

పండగలు వస్తే అమ్మకాలను పెంచుకునేందుకు వ్యాపారులు ఓ పక్క డిస్కౌంట్లు ప్రకటిస్తుంటే.. మద్యం వ్యాపారులు మాత్రం పండగపేరు చెప్పి రేట్లు పెంచేస్తున్నారు.గగ్గోలు పెడుతున్న మందుబాబులు

తూర్పుగోదావరి, కాజులూరు (రామచంద్రపురం): పండగలు వస్తే అమ్మకాలను పెంచుకునేందుకు వ్యాపారులు ఒక పక్క డిస్కౌంట్‌లు ప్రకటిస్తుంటే.. మద్యం వ్యాపారులు మాత్రం పండగ పేరు చెప్పి రేట్లు పెంచేస్తున్నారు. మరో పక్క పండగ పేరుతో కోడిపందేలు, గుండాట తదితర వాటిలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. కోడిపందేలు నిర్వహించే చోట్ల మద్యం ఏరులై పారుతోంది. దీంతో నియోజకవర్గంలో మద్యం వ్యాపారులు ధరలు పెంచేశారు. మండలాల వారీగా అందరూ సిండికేట్‌గా మారడంతో పండుగ పేరుతో క్వార్టర్‌ బ్యాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా కొన్నాళ్లుగా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు. అయితే పండగ రోజుల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని, ఈ మూడు రోజులు ధర పెంచితే కాస్త లాభపడతామంటూ రాజకీయ పెద్దలు, ఎక్సైజ్‌ అధికారులతో లాలూచీ పడినట్టు సమాచారం. ఇందుకోసం నెలవారీగా ఇచ్చే మామూళ్లకు అదనంగా షాపునకు రూ.10 వేలు అదనంగా సిండికేట్‌ యజమానులు ముట్ట చెబుతున్నట్టు పలువురు చెబుతున్నారు. రామచంద్రపురం పట్టణం, రూరల్‌ మండలం, కె.గంగవరం మండలాల్లోని గ్రామాలు రామచంద్రపురం ఎక్సైజ్‌ పరిధిలో ఉండగా నియోజకవర్గంలోని మరో మండలం కాజులూరు.. తాళ్లరేవు ఎక్సైజ్‌ పరిధిలో ఉంది. ఇందుకు ఈ రెండు ఎక్సైజ్‌ పరిధిల్లోని ఈమేకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.

కొన్ని బ్రాండ్ల మద్యానికే పెంపు
అయితే అన్ని రకాల బ్రాండులకు ధరలు పెంచితే ఇబ్బందులు వస్తాయని, అమ్మకాలు ఎక్కువ ఉండే వాటిని పెంచడానికే ఎక్సైజ్‌ అధికారులు ఒప్పుకున్నారట. దీంతో గ్రామీణ ప్రాంత షాపుల్లో పేద, మధ్య తరగతి వారు తాగే చీప్‌ లిక్కర్, మిడిల్‌ రెంజ్‌ మద్యం సీసాలే 90 శాతం అమ్మకాలు ఉంటాయి. వీటి ధరలను ఇప్పుడు పెంచేశారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 8 షాపులు, రామచంద్రపురం పట్టణంలో ఐదు షాపులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కాజులూరు మండలంలోని షాపుల్లో రోజుకు సగటున రూ.8 లక్షల మద్యం విక్రయాలు ఉంటాయి. పండుగ మూడు రోజులు అమ్మకాలు రెట్టింపు ఉంటాయని అంచనా.

మరిన్ని వార్తలు