ఊ'ధర'గొట్టుడేనా..!

27 Apr, 2019 13:11 IST|Sakshi

ఎమ్మార్పీ అమలయ్యేనా?

ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సీరియస్‌

రంగంలోకి ఎస్టీఎఫ్‌ బృందాలు

దొరికితే లైసెన్సు సస్పెన్షన్‌

ఆ తర్వాత శాశ్వతంగా రద్దు

అబ్కారీ కమిషనర్‌ సీరియస్‌ కావడంతో మద్యం ఎమ్మార్పీపై దృష్టి పెడుతున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే అబ్కారీ శాఖ మంత్రిగా కొత్తపల్లి జవహర్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో ఆ శాఖ అధికారుల కన్నా మద్యం సిండికేట్లదే పైచేయిగా మారిన సంగతి తెలిసిందే.  ఎన్నికల వేళ కూడా అధికారపార్టీ నేతల అండదండలతో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు సాగించారు. ఇప్పుడు కూడా జిల్లాలో ఎక్కువ ధరలకే మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎమ్మార్పీని అమలు చేసేనా అనే సందేహం వ్యక్తమవుతోంది.  

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: పోలింగ్‌ తర్వాత ఎమ్మార్పీ ఉల్లంఘనలపై కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో గురువారం ఆయా జిల్లాల అధికారులతో అబ్కారీ కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలకు సంబంధించి గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పాటించకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారం పాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఉల్లంఘనులపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించారు. బెల్ట్‌షాపులు, పర్మిట్‌ రూమ్‌ల పేరుతో జరుగుతున్న దందాలపై కూడా దృష్టి పెట్టాలని కమిషనర్‌ ఆదేశించారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో ఏలూరు, భీమవరం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల పరిధిలో మొత్తం 470 వరకూ దుకాణాలు ఉన్నాయి. బార్లు మొత్తం 40 వరకూ ఉన్నాయి. జిల్లాలో అధికారపార్టీకి చెందిన వారే మద్యం వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం, స్వయంగా ఆ శాఖ మంత్రి జిల్లావాడు కావడం, ఆయన ముఖ్య అనుచరులే సిండికేట్లకు నాయకత్వం వహించడంతో అనధికారికంగా మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచి మద్యంవ్యాపారులు అమ్ముకుంటున్నారు.  ఎమ్మార్పీ ఉల్లంఘనలకు అబ్కారీ అధికారులే మౌఖిక ఆదేశాలు జారీ చేయడం  గమనార్హం.  

పర్మిట్‌ రూముల్లోనూవారి చెప్పినంత ఇవాల్సిందే.
పర్మిట్‌ రూమ్‌ అంటే లోపల మద్యం కొనుకున్నవాడు తాగి వెళ్లిపోవాలి. వసతులేమీ ఉండకూడదు. అయితే పర్మిట్‌ రూమ్‌ల పేరుతో అనుమతి తీసుకుని బార్లను తలపించేలా సిట్టింగ్‌ రూంలు ఏర్పాటు చేస్తున్నారు.  ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో కొత్త సంస్కృతికి అధికార పార్టీ నేతలు తెరలేపారు. బెల్ట్‌షాపులకు అనుబంధంగా దాబాలను ఏర్పాటు చేశారు. గోపన్నపాలెంలో షాపునకు అనుబంధంగా కల్యాణమండపం అద్దెకు తీసుకుని దాన్ని పర్మిట్‌రూమ్‌గా మార్చేశారు. పక్కన ఒక దాబా. దుగ్గిరాల బైపాస్‌ వద్ద ఒక దాబాలో సిట్టింగ్‌ బెల్ట్‌షాపు, చింతలపూడి బైపాస్‌లో దాబా కూడా బెల్ట్‌షాపులా నడుస్తోంది. ఏలూరు చుట్టుపక్కలగ్రామాల్లో బెల్ట్‌షాపులతోపాటు దాబాల ను అక్కడి ప్రజాప్రతినిధి ఏర్పాటు చేయించారు. జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో దాదాపుగా సిట్టింగ్‌ రూములు ఉన్నాయి. అర్ధరాత్రి కూడా దుకాణాల్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇక్కడ మద్యం క్వార్టర్‌పై అదనంగా రూ. 30 నుంచి రూ. 50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. పోలీసులకు, ఎక్సైజ్‌ శాఖకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటం వల్లే మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ఉల్లంఘన, అర్ధరాత్రి అమ్మకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో మద్యం దుకాణాల వేళలపై కొంత నియంత్రణ ఉంది. ఉదయం ఆరు గంటలకు తీసి రాత్రి 12 గంటల వరకూ నడిచేవి. అయితే ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నడుస్తున్నాయి.

జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌..
ఎమ్మార్పీ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకుæ అధికారులు రంగంలోకి దిగారు. వారంపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు ఎస్టీఎఫ్‌ బృందాలు సం యుక్తంగా కలిసి దాడులు చేయబోతున్నాయి. ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే షాపుల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తారు. విచారణ తర్వాత శాశ్వతంగా రద్దు చేస్తారు.

దృష్టిపెట్టాం
జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకు మించి అదనంగా మద్యాన్ని విక్రయిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటి షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తాం. అలాగే ఎవరైనా ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే ఆ దుకాణాలపైనా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.– వైబీ భాస్కరరావు,డిప్యూటీ కమిషనర్, అబ్కారీ శాఖ

>
మరిన్ని వార్తలు