ఛీర్స్‌

30 Oct, 2018 13:12 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ‘మూడు ఫుల్లులు..ఆరు బీర్లు’ అన్న చందంగా ఉంది మందుబాబుల జోష్‌. గడచిన మూడు నెలల్లో రూ 387.56 కోట్ల మేర మద్యం తాగేశారంటే జిల్లాలో పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. జిల్లావ్యాప్తంగా(నెల్లూరు, గూడూరు ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో) 349 మద్యం దుకాణాలు, 46 బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు సుమారు రూ.3 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇక పండగ, పబ్బాల సమయంలో రోజుకు రూ.4.50 కోట్ల మేర అమ్మకాలు జరుగుతుంటాయి. దీంతో ఇటు మద్యం వ్యాపారులు, అటు ఆబ్కారీశాఖ పంట పండుతోంది.

నెలనెలా పెరుగుతున్న విక్రయాలు
సంతోషం, దుఃఖం, పండగ, పబ్బం ఇలా ఏదొచ్చినా మద్యం సేవించడం పరిపాటిగా మారిపోయింది. వయస్సుకు సంబంధం లేకుండా ఆల్కహాల్‌ సేవించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆధునికత పేరుతో యువత మత్తులో చిత్తవుతోంది. మహిళలు సైతం ఆల్కహాల్‌కు బానిసవుతున్నట్లు ఇటీవల జరిగిన సర్వేలో వెల్లడైంది. దీంతో మద్యం విక్రయాలు తారాస్థాయికి చేరుతున్నాయి.

నియంత్రణ అంతంతమాత్రం
మద్యం విక్రయాలపై నియంత్రణ సైతం అంతంతమాత్రంగానే ఉంది. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో గతంలో నెలకు రూ.100 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతుండేవి. ప్రస్తుతం 25 శాతం అదనంగా విక్రయాలు పెరిగాయి. నెలకు సగటున రూ.125 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రతి పల్లెలో మద్యం అందుబాటులో ఉండడం, పలు ప్రాంతాల్లో బెల్టుషాపుల్లో మద్యం దొరుకుతుండడంతో మందుబాబుల జోష్‌కు అంతేలేకుండాపోతోంది.

సారా పోయె.. మద్యం వచ్చె
రాష్ట్ర ప్రభుత్వం నవోదయం పేరిట సారరహిత జిల్లాలను చేయడంలో భాగంగా సార తయారీ, అమ్మకాలను నిర్మూలించింది. అలాగే ఎక్సైజ్‌ అధికారులు విస్తృత తనిఖీల నేపథ్యంలో సారా పాక్షికంగా తగ్గుముఖం పట్టింది. సారా అమ్మకాలు తగ్గటం సైతం మద్యం అమ్మకాలు పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.

మూడు నెలల్లో రూ.387.56 కోట్ల విక్రయాలు
ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే ఈ మూడు నెలల వ్యవధిలో జిల్లాలో రూ.387.56 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఆగస్టులో రూ.125.10 కోట్ల విలువ చేసే 2,33,769 మద్యం కేస్‌లు, 1,65,069 బీరు కేసులు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌లో పలు పండగలు రావడంతో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగాయి. రూ.130.46 కోట్ల విలువ చేసే 2,46,266 కేసుల మద్యం, 1,73,234 కేసుల బీరు అమ్ముడైంది. అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు రూ.125 కోట్ల విలువ చేసే 1,94,493 మద్యం కేసులు, 1,39,877 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అక్టోబర్‌ నెల ముగిసేనాటి మరో రూ. 7 కోట్లు విక్రయాలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మూడు నెలల వ్యవధిలో అక్షరాల రూ.387.56 కోట్ల మద్యాన్ని జిల్లాలోని మందుబాబులు తాగేశారు.  

మరిన్ని వార్తలు