మద్యం షాపులు మాకొద్దు

13 Jul, 2015 03:59 IST|Sakshi
మద్యం షాపులు మాకొద్దు

- జోరుగా నాటుసారా.. తక్కువ ధరకే తమిళనాడు సరుకు
- విచ్చలవిడిగా కర్ణాటక కల్తీ మద్యం దిగుమతి
- ఎంఆర్‌పీ వల్ల నష్టాలే.. ముందుకురాని వ్యాపారులు
- రెండుసార్లు టెండర్లు పిలిచినా మిగిలిపోయిన 72 దుకాణాలు
- ముచ్చటగా మూడోసారి నోటిఫికేషన్
సాక్షి, చిత్తూరు :
ఓవైపు తక్కువ ధరకే తమిళనాడు మద్యం... మరోవైపు విచ్చలవిడిగా కర్ణాటక కల్తీ సరుకు.. వీటి నడుమ ఊరూరా ఏరులై పారుతున్న సారా.. పర్యవసనం.. జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపులకు డిమాండ్ తగ్గడం.. ఇదీ చిత్తూరు, తిరుపతి నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మద్యం అమ్మకాల పరిస్థితి. ఇక ఎంఆర్‌పీతో మద్యం అమ్మకాలంటే లాభం అంతంత మాత్రమే. దీంతో మద్యం షాపుల కోసం రూ.లక్షలు వెచ్చించేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టిన  వారు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు మద్యం షాపులకు టెండర్లు పిలిచినా ఎవరూ ఆసక్తి కనబరచకపోవడంతో 72 మద్యం షాపులు అలాగే మిగిలి పోయాయి. దీంతో గత్యంతరం లేక అధికారులు మూడోసారి మద్యం దుకాణాల కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చింది.
 
నష్టాలొస్తాయని టెండర్లకు మద్యం వ్యాపారుల విముఖత
జిల్లాకు ప్రభుత్వం 458 మద్యం దుకాణాలను కేటాయించింది. ఇందులో 48 దుకాణాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మిగిలిన 410 దుకాణాలకు మొదట విడతలో టెండర్లు పిలవగా, 320 దుకాణాలకు 3,051 మంది దరఖాస్తులు చేశారు. మిగిలిన 90 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా పడలేదు. దీంతో రెండో విడత టెండర్లు పిలవాల్సి వచ్చింది. చిత్తూరు  ఎక్సైజ్ పరిధిలో 43, తిరుపతి పరిధిలో 47 మొత్తం 90 దుకాణాలకు టెండర్లు దరఖాస్తులు ఆహ్వానించగా, 18 దుకాణాలకు మాత్రమే 30 దరఖాస్తులందాయి. లెసైన్స్ ఫీజు పెద్ద ఎత్తున పెంచడం, ప్రభుత్వం మద్యం దుకాణాలు అధిక మొత్తంలో కేటాయించడం కొంత కారణమని తెలుస్తోంది. ఎంఆర్‌పీకే మద్యం అమ్మకాలు సాగించాల్సి వస్తే లెసైన్స్ ఫీజులు పెరిగిన నేపథ్యంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు రాష్ట్రంలో 12 వేల మందికి ఒక మద్యం షాపు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ ఒక్క జిల్లాలో మాత్రం 7 వేల మందికి ఒక మద్యం షాపు చొప్పున అత్యధిక సంఖ్యలో కేటాయించింది. దీంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, చిత్తూరు, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు తదితర నియోజకవర్గాల పరిధిలో వందలాది గ్రామాల్లో నాటుసారా పెద్ద ఎత్తున తయారవుతూ జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తక్కువ ధర ఉన్న దానివైపే మొగ్గుతున్నారు. మరోవైపు తమిళనాడులో మన రాష్ట్రంతో పోలిస్తే క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి 30 వరకు తేడా ఉండడంతో ప్రజలు ఆ మద్యం వైపు మరలుతున్నారు. ఇదే అదునుగా అక్ర మ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆ మద్యాన్ని దిగుమతి చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.
 
కొందరు ప్రభుత్వం మద్యం దుకాణాల యజమానులు సైతం కర్ణాటక నకిలీ మద్యాన్ని ఇక్కడి మద్యంతో కలిపి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. నాటుసారాతో పాటు అక్రమ మద్యం వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లే కీలక పాత్ర పోషిస్తుండడంతో అధికారులు వారి జోలికెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు మాకొద్దు బాబాయ్... అంటూ వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు.

మరిన్ని వార్తలు