నల్లమలలో అలర్ట్‌

24 Sep, 2019 12:17 IST|Sakshi
నల్లమల అటవీ ప్రాంతం   

సాక్షి, మార్కాపురం(ప్రకాశం) :విశాఖ మన్యంలో ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇదే సమయంలో నల్లమలలో యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో వారం రోజుల కిందట మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులపై నిఘా పెట్టాలని, అన్ని పోలీసుస్టేషన్‌ల ఎస్‌ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మన్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. ముందు జాగ్రత్తగా నల్లమల పరిధిలోని పోలీసుస్టేషన్‌ సిబ్బందిని అలర్ట్‌ చేసి మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించాలని ఆదేశించారు. గతంలో నల్లమల అటవీ ప్రాంతం, మావోయిస్టులకు నిలయంగా ఉండేది. పలువురు రాష్ట్ర స్థాయి అగ్రనేతలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు.

ప్రధానంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే నల్లమలలోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించే వారు. పలు సార్లు పోలీసుల ఎన్‌కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్లలో అప్పటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, తదితరులు మృతి చెందారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోవడం, మరికొందరు లొంగిపోవటంతో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. గత నెల నుంచి యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయని, దాన్ని వ్యతిరేకించాలంటూ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సోషల్‌ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యమం ద్వార మళ్లీ మావోయిస్టులు ప్రవేశిస్తారా, ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ మద్దతు ఇస్తున్నారా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. పనిలో పనిగా లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే అంశాలపై సంబంధిత స్టేషన్‌ల ఎస్‌ఐలు సమాచారాన్ని సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

గతంలో మార్కాపురం డివిజన్‌లోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, అర్ధవీడు, కంభం, రాచర్ల, గిద్దలూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మావోయిస్టులు కార్యకలాపాలు, ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మళ్లీ నల్లమలలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెడుతున్నారు. మరో వైపు మావోయిస్టులు ఏవోబీలో కార్యకలాపాలు చేస్తూ నల్లమలను షెల్టర్‌ జోన్‌గా వాడుకుంటున్నారా అనే అంశంపై కూడా సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉద్యమం లేకున్నా పోలీసులు మాత్రం ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. ఈ విషయమై మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నల్లమలలో మావోయిస్టుల కదలికలు లేవని, అయినా సిబ్బందిని అలర్ట్‌ చేశామని స్పష్టం చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా