జిల్లాకు జ్వరమొచ్చింది

1 Dec, 2013 03:35 IST|Sakshi
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :అవును.. జిల్లాకు జ్వరమొచ్చింది. పట్టణం.. గ్రామీణ ప్రాంతాలనే తేడాలేకుండా ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఎవరిని కదిపినా మలేరియూ.. టైఫాయిడ్ జ్వరమనే చెబుతున్నారు. అక్కడక్కడా డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. చికున్ గున్యా కేసులైతే లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధికులకు ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
 అధికారిక గణాంకాల ప్రకారం...
 జిల్లా మలేరియా నివారణ అధికారి ఎ.రామరాజు నవంబర్ 14న తాడేపల్లిగూడెం వచ్చిన సందర్భంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం జిల్లాలో అప్పటివరకూ 607 మలేరియూ కేసులు నమోదయ్యూయి. 17 డెంగీ కేసులు సైతం నమోదైనట్టు ఆయన స్పష్టం చేశారు. తాళ్ళముదునూరుపాడులో డెంగీ లక్షణాలతోమృతి చెందిన వెలగల అనంతలక్ష్మి కుటుం బాన్ని ఆయన పరామర్శించారు. ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక నకళ్లను ఆ సందర్భంలో సేకరించారు. ఆ తరువాత 16 రోజుల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం నమోదైన మలేరియూ, డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తుంటే.. అనధికారికంగా ఈ తరహా కేసులు అనేకం ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. డెంగీ అనుమానాస్పద కేసులు నమోదు అవుతున్నా వైద్యాధికారులు మాత్రం అవేమీ డెంగీ కాదని, సాధారణ జ్వరాలేనని కొట్టిపారేస్తున్నారు. పారిశుధ్య పరిస్థితులు క్షీణించడం వల్ల దోమలు పెరిగిపోరుు సాధారణ జ్వరాలు విజృంభిస్తున్నాయని తేల్చేస్తున్నారు. 
 
 డెంగీ కేసులు తక్కువేమీ కాదు
 వైద్య అధికారులు జిల్లాలో డెంగీ జాడలు లేవంటున్నారు. మొన్నటివరకూ 17 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యూయని, ఇదేమీ ఆందోళన కలిగించే విషయం కాదని చేతులు దులిపేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారుు. జ్వరాల బారిన పడిన అత్యధికుల్లో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతోంది. తాడేపల్లిగూడెం పరిధిలో డెంగీ అనుమానాస్పద కేసులు 3 ఉన్నట్లు తెలుస్తోంది. తాళ్ళముదునూరుపాడులో రెండు డెంగీ అనుమానాస్పద కేసులు, తాడేపల్లిగూడెంలో ఒకటి ఉన్నాయి. తాడేపల్లిగూడెం, పెదతాడేపల్లి, జువ్వలపాలెం ప్రాంతాల్లో టైఫాయిడ్ విజృంభిస్తోంది. యాగర్లపల్లి, వీకర్స్‌కాలనీలోనూ ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. నిడదవోలులోనూ డెంగీ అనుమానాస్పద కేసులు రెండు నమోదు అయ్యాయి. ఏలూరు నగరంలో ఇద్దరు వ్యక్తులు డెంగీ బారిన పడినట్లు తెలుస్తోంది. జ్వరాలతో రోజూ కనీసం ఐదారుగురు తగ్గని జ్వరాలతో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య లెక్కకు అందనంత స్థాయిలో ఉంది. వీరిలో ఎక్కువ శాతం మంది టైఫాయిడ్‌తో బాధపడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తణుకు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోనూ విషజ్వరాలు అధికంగా నమోదవుతున్నాయి. 
 
 ఏజెన్సీ పడకేసింది
 ఏజెన్సీ గ్రామాలను మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కుదిపేస్తున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం 40నుంచి 50 మంది వరకు జ్వరాలతో మంచాలు పట్టారు. రేకులపాడు, రేపల్లె, చింతపల్లి, చింతకొండ, గుట్టాలరేవు, కన్నారప్పాడు వంటి గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభించడంతో గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. అధికారులెవరూ ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేదు. 
 
 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు