'కత్తి’ కడితే కటకటాలే..!

14 Jan, 2020 08:07 IST|Sakshi
విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో అనధికారికంగా ఏర్పాటవుతున్న బరి 

బరులపై పోలీసుల నిఘా 

కొనసాగుతున్న అనధికారిక బరుల గుర్తింపు

సంప్రదాయ ముసుగులో జూద క్రీడలు నిర్వహిస్తే చర్యలు 

జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పిండివంటల ఘుమఘుమలు.. బంధుమిత్రులు, ఆత్మీయుల కలయికలు, కొత్త అల్లుళ్ల సరదాలతో పండగ శోభ సంతరించుకుంది. మరోవైపు క్రీడల నిర్వహణ పేరుతో కొందరు కోడి పందేల బరులు ఏర్పాటు చేస్తున్నారు. భోగి వరకూ క్రీడా పోటీల వేదికలుగా ఉపయోగిస్తూ ఆ తర్వాత కోడిపందేల బరులుగా మార్చే ఎత్తుగడ కొనసాగుతోంది. అయితే అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

సాక్షి, అమరావతిబ్యూరో: సంప్రదాయం ముసుగులో కోడిపందేలు నిర్వహించే వారు కటకటాలు లెక్కించక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందు నుంచే నగరంలోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. రోజూ ఎక్కడో చోట గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు. గతంలో సంక్రాంతి పండుగ ముందురోజు హడావుడిగా బరి ప్రాంతాలను శుభ్రం చేసి చదునుచేసి టెంట్లు ఏర్పాటు చేసి పందేలను నిర్వహించే వారు. రానురాను పందేలు నిర్వహణ తీరులో మార్పులు సంతరించుకుంటున్నాయి.

విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో అనధికారికంగా ఏర్పాటవుతున్న బరి

ముందస్తుగా బరుల ఏర్పాటుకు ఇబ్బందులు లేకుండా సంక్రాంతి క్రీడా పోటీల నిర్వహణ పేరుతో వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను సిద్ధం చేసి తాత్కాలికంగా వివిధ రకాల క్రీడా పోటీలకు శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని గన్నవరం, కంకిపాడు, ఉంగుటూరు, తోట్లవల్లూరు, నున్న, ఆత్కూరు పరిధిల్లో ఇలాంటి అనధికార బరులను పదకొడింటిని పోలీసులు గుర్తించారు. పలుచోట్ల స్థలాలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నట్లు గుర్తించారు. అడిగితే సంక్రాంతికి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం స్థలాన్ని చదునుచేశామని చెబుతున్నారు. దీంతో అధికారులు వారిని ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడుతోంది.

చదవండి: సంక్రాంతికి మీ ఇంటికా.. మా ఇంటికా?

 నిర్వాహకుల ధీమా..  
న్యాయస్థానం ఆదేశాలతో కోడిపందేలు, ఇతర జూదాలను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బరి ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా చివరి మూడు రోజులు అనుమతులు వస్తాయని నిర్వాహకులు ధీమాగా ఉంటున్నారు.  

కఠినంగా వ్యవహరిస్తాం..  
అనుమతి లేకుండా బరులు ఏర్పాటు చేసినా.. నిబంధనలు ఉల్లంఘించి కత్తి కట్టి కోడిపందేలు నిర్వహించినా నేరం. అలాంటి నిర్వాహకులపై జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారం సెక్షన్‌–11 కింద కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే పోలీసుల అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన 11 బరులను గుర్తించాం. పోలీసుల అనుమతితో సంప్రదాయ బద్ధంగా రంగవల్లులు, క్రీడల పోటీలు నిర్వహించవచ్చు. అలా కాకుండా సంప్రదాయం ముసుగులో కోడిపందేలు, పేకాట, గుండాట, కోతాట, నెంబరు పందేలు తదితర జూదక్రీడలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.  
– ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ 

మరిన్ని వార్తలు