ఏపీ సీఎస్‌ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

25 Apr, 2019 17:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎస్ సమీక్షలపై అధికార పక్షం విమర్శలు సంధిస్తున్న సమయంలో ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు?.ఎవరిని కలవబోతున్నారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఎన్టీటి (జాతీయ హరిత ట్రిబ్యునల్‌) విచారణ కోసమే సీఎస్‌ ఢిల్లీ వెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పర్యటనపై  అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. 

కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై రేపు (శుక్రవారం మధ్యాహ్నం) నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌‌లో జరిగే విచారణకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవడంపై ఎన్జీటీలో విచారణ జరుగుతోంది. ప్రధానంగా పురపాలక సంఘాలు, అటవీ శాఖలు విఫలమవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  పర్యావరణాన్ని కాపాడటం, అటవీ చట్టాల ఉల్లంఘనపై ఎన్జీటీ రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్జీటీలో జరిగే విచారణకు సీఎస్‌తో పాటు  పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్,  అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఢిల్లీ వెళ్లారు.

మరోవైపు కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై  పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి 100కోట్ల రుపాయలు నెల రోజుల్లోగా డిపాజిట్ చేయాలని జాతీయ  హరిత ట్రిబ్యునల్‌ ఏప్రిల్ 4న ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. దీనిపై గడువు దాటితే 12.5శాతం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.  ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్‌ బృందం వాదనలు వినిపించనుంది. మరోవైపు హస్తిన పర్యటనలో ప్రధాన కార్యదర్శి ఎవరెవరిని కలుస్తారనే  దానిపై ఉత్కంఠ  నెలకొంది. ఆయన ఎన్జీటీ విచారణకు పరిమితమవుతారా, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర ఢిల్లీ పెద్దలను కలుస్తారనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సీఎస్‌ టార్గెట్‌గా టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు