ఇక్కడ అన్ని సౌకర్యాలూ కలవు (డబ్బులిస్తేనే..)

7 Oct, 2019 09:43 IST|Sakshi
ఆదివారం సెలవు రోజున సబ్‌జైలులోకి బిర్యానీ ప్యాకెట్లను తీసుకెళ్తున్న ప్రైవేట్‌ వ్యక్తి

అవినీతికి కేరాఫ్‌గా మారిన ధర్మవరం సబ్‌జైలు

ఖైదీలకు సకల సౌకర్యాలు

బయటి నుంచి ఆహార పదార్థాలు, లిక్కర్‌ సౌలభ్యం

సెల్‌ఫోన్, వీడియో కాల్‌లో ఖైదీల సంభాషణలు

జైలు ఉన్నతాధికారి కనుసన్నల్లోనే దందా!

డబ్బులివ్వని ఖైదీల పట్ల దారుణ వైఖరి

ధర్మవరం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి  ఓ కేసులో రిమాండ్‌ ఖైదీగా నెల రోజుల పాటు ధర్మవరం సబ్‌జైల్‌లో ఉన్నాడు. జైల్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు సౌకర్యాల కోసం జైలు ఉన్నతాధికారితో రూ.50వేలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. అంతే ఇంకేముంది రోజూ బిర్యానీ, లిక్కర్‌ జైలులోనికి అనుమతి ఇచ్చారు. వాట్సాప్‌ కాల్‌ ద్వారా కుటుంబ సభ్యులతో ప్రతి రోజు జైలు నుండే సదరు ఖైదీ సంభాషణలు జరిపాడు. నేరం చేసి రిమాండ్‌లో ఉన్న ఖైదీకి ఇంట్లో కంటే మంచి సౌకర్యాలనే జైలు అధికారులు కల్పించారు.

ధర్మవరం మండలానికి చెందిన మరో వ్యక్తి కేసు నిమిత్తం 25రోజుల రిమాండ్‌కు ధర్మవరం సబ్‌జైలుకు వచ్చాడు. సదరు ఖైదీ కుటుంబ సభ్యులు ములాఖత్‌ కోసం జైలుకు వస్తే ఒక్కొక్కరితో రూ.1000లు వసూలు చేశారు. మా దగ్గర డబ్బులు లేవు సార్‌.. అంటూ వారు వేడుకుంటే రూ.500 లైనా ఇవ్వందే లోపలికి  పంపించం అంటూ జైలు అధికారులు దౌర్జన్యం చేశారు. చేసేది లేక ముడుపులు ముట్టజెప్పి తమవారిని కలుసుకున్నారు.

ధర్మవరం: ధర్మవరం సబ్‌జైలు.. డబ్బులున్న వారికి ఓ లాడ్జిలాగా కనపడుతుంటే సాధారణ నిరుపేద ఖైదీలు మాత్రం సబ్‌జైలులో వసూళ్ల పర్వం చూసి జడుసుకుంటున్నారు. జైలులో పని చేస్తున్న ఉన్నతాధికారి ధనధాహానికి కింద సిబ్బంది సైతం బలవంతంగా అయినా సరే డబ్బులు వసూలు చేస్తున్నారు. చేసిన నేరం కంటే సబ్‌జైలులో వాతావరణమే ఎక్కువగా బాధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం కోర్టు పరిధిలోని రిమాండ్‌ ఖైదీలను ఇక్కడి సబ్‌జైలుకు తరలిస్తుంటారు. ఖైదీలను సత్ప్రవర్తన కోసం రిమాండ్‌కు న్యాయ స్థానం పంపితే ఆ ఉద్దేశ్యాన్ని జైలు అధికారులు పక్కదోవ పట్టిస్తున్నారు.

డబ్బులిస్తే సకల సౌకర్యాలు
సబ్‌జైలులో ఉన్న రిమాండ్‌ ఖైదీలు డబ్బులు ముట్టజెబితే అధికారులు వారికి సకల సౌకార్యలనూ కల్పిస్తున్నారు. ఖైదీ ఇచ్చే డబ్బును బట్టీ సౌకర్యాలు ఉంటాయి. బయట నుంచి బిర్యానీ, టిఫిన్‌ వంటి ఆహార పదార్థాలను సమకూర్చుతున్నారు. అంతేకాదు బడాబాబులు ఎవరైనా జైల్‌కు వస్తే వారికి లిక్కర్, సిగరెట్లు వంటి వాటిని కూడా అనుమతిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెల్‌ఫోన్‌లు జైల్‌లోకి అనుమతించకూడదన్న నిబంధన ఉంది. అయితే డబ్బులు ఇచ్చిన ఖైదీలకు మాత్రం సెల్‌ఫోన్‌లను అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో ఖైదీలు ఏకంగా వాట్సాప్, వీడియో కాల్స్‌ చేసుకుంటున్న విషయం గుప్పు మంటోంది. ఇదిలా ఉంటే డబ్బులు లేని సాధారణ ఖైదీలు మాత్రం నరకయాతన అనుమతిస్తున్నారు. వీరికి కనీసం మస్కిటో కాయిల్స్‌ కూడా అందుబాటులో ఉంచడం లేదు. అంతేకాదు రోజు వడ్డించే అన్నం, కూరలు చాలా నాశిరకంగా ఉంటున్నాయని పలువురు రిమాండ్‌ ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ములాఖత్‌కు ముట్టజెప్పాల్సిందే..
సాధారణంగా జైలులో ఆదివారం, పండుగ రోజులలో సెలవు ఉంటుంది. ఈ సమయాల్లో బయట వారిని ములాఖత్‌కు అనుమతించరు. మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటల నుంచి 5వరకు రిమాండ్‌ ఖైదీలను కలిసేందుకు సంబంధీకులకు అనుమతి ఉంటుంది. అయితే ములాఖత్‌కు వచ్చిన కుటుంబ సభ్యులు జైలు సిబ్బందికి లోపలికి వెళ్లగానే రూ.1000లు ముట్టజెప్పాల్సి ఉంది. డబ్బులు ఇవ్వక పోతే ఖైదీని పిలిచే పరిస్థితి లేదు. డబ్బులు ముట్టజెప్పిన ఖైదీ కుటుంబ సభ్యులు ఎంత సేపైనా ప్రాంగణంలో ఖైదీతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అంతేకాదు డబ్బులు ముట్టజెబితే సెలవురోజుల్లో కూడా ములాఖత్‌కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

జైలు ఉన్నతాధికారికనుసన్నల్లోనే..
ముడుపుల తతంగం అంతా జైలు ఉన్నతాధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా సమాచారం. ప్రతి రోజు సిబ్బందికి టార్గెట్‌ విధించి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన వసూళ్లలో కొంత మేర సిబ్బంది పంచుకొని మిగిలిన మొత్తాన్ని సదరు ఉన్నతాధాకారికి అందజేస్తున్నట్లు సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పం దించి ముడుపుల వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా