ప్రజలకు మేలు చేయడంలో భాగస్వాములుకండి

12 Feb, 2019 04:38 IST|Sakshi
అనంతపురంలో తటస్థులతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

తటస్థ ప్రభావితులతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రభుత్వాస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తూ ‘ప్రైవేటు’ను ప్రోత్సహిస్తున్నారు 

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని సమూలంగా మార్చేస్తాం.. 

చంద్రబాబు మూసేసిన ప్రభుత్వ పాఠశాలలన్నీ తెరిపిస్తాం

క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌

సాక్షి, అమరావతి: ప్రజలందరికీ మేలు చేయడంలో భాగస్వాములు కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తటస్థ ప్రభావితులను కోరారు. అనంతపురంలో సోమవారం ఆయన వారితో సమావేశమయ్యారు. ప్రజలకు మరింత మేలు చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా పలువురు తటస్థ ప్రభావితులు అడిగిన ప్రశ్నలకు వైఎస్‌ జగన్‌ సమాధానాలిస్తూ.. చంద్రబాబు ఓ పథకం ప్రకారం ప్రభుత్వాస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలను నీరుగారుస్తున్నారని చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు, నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. దేవుడి ఆశీర్వాదంతో, ప్రజలందరి దీవెనలతో రేపు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. ప్రభుత్వాస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడటంతో పాటు.. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుతామని చెప్పారు. జగన్‌ అయినా సరే అనారోగ్యానికి గురైతే ప్రభుత్వాస్పత్రుల్లోనే చికిత్స చేయించుకునే స్థాయిలో వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో చంద్రబాబు మూసేసిన పాఠశాలలన్నింటినీ తెరిపిస్తామని చెప్పారు. క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.
 
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం 
ఉపాధి హామీ పథకంలో లేబర్‌ కాంపొనెంట్‌ 98 శాతం ఉండేలా పనులు చేపట్టి.. చేతినిండా పని కల్పించి.. కూలీలకు వేతనాలు గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన ప్రభుత్వం రాగానే చట్టసభల మొదటి సమావేశాల్లోనే.. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టాన్ని తెస్తామన్నారు. అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డెంటల్‌ డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయడంతో పాటు.. పీహెచ్‌సీ కేంద్రాల్లో అన్ని రకాల చికిత్సలను అందుబాటులోకి తెస్తామన్నారు. 104 సర్వీసు ద్వారా కంటి నుంచి పంటి వరకూ అన్ని రకాల చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.  

>
మరిన్ని వార్తలు