మంచిర్యాల జిల్లాపై ఆశలు

13 Aug, 2013 03:25 IST|Sakshi


 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో జిల్లాల పునర్విభజన తాజా అంశంగా మారింది. మంచిర్యాల జిల్లా ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో ఏ నోట విన్నా మంచిర్యాల జిల్లాపైనే చర్చ జరుగుతోంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూరు(టి) నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పడుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు నిర్ణయం జిల్లావాసుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి ఎన్నికలప్పుడే తెరపైకి వచ్చి కనుమరుగయ్యే మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు ఊసు మరోసారి తెరపైకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
 
 ఎన్నికల హామీగా మిగిలిన జిల్లా..
 మంచిర్యాల జిల్లా ఏర్పాటు ఇంతకాలం రాజకీ య పార్టీలకు ఎన్నికల ఎజెండాగా మారింది. సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని సాధారణ ఎన్నికల వరకు కూడా అన్నీ హామీలే. ఎన్నికల తంతు ముగిశాక ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా ఏర్పాటు అంశం ఇటూ అధికార పార్టీలు, అటూ ప్రజాప్రతినిధులకు సంకటంగా మారింది. తూర్పు జిల్లా ప్రజలు అనేక మార్లు రాజకీయ పార్టీల తీరును ఎండగట్టిన సందర్భాలున్నాయి. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని ధర్నాలు, నిరాహార దీక్షలు వంటి ఆందోళన కార్యక్రమాలు కూడా పార్టీలకు పరిపాటిగా మారాయి. మంచిర్యాలలో పర్యటించిన బీజేపీ నేత ఎల్.కె.అద్వానీతోపాటు వివిధ పార్టీల జాతీయ, రాష్ట్ర నేతలు మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చిన సందర్భాలున్నాయి. ప్రత్యేక జిల్లా కోసం అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు నిర్వహించిన దాఖలాలున్నాయి. అయితే ఎట్టకేలకు ఇటీవల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైన తరుణంలో జిల్లాల పునర్విభజన అంశం వెలుగులోకి రాగా, మంచిర్యాల జిల్లా ఏర్పాటు ఇక తథ్యమన్న చర్చ జరుగుతోంది.
 
 26 మండలాలు.. 283 గ్రామాలు..
 ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 52 మండలాలు, 866 గ్రామాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తే మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూరు(టి) నియోజకవర్గాల్లోని 26 మండలాలు, 283 గ్రామాలు వస్తా యి. మంచిర్యాల నియోజకవర్గంలో మంచి ర్యాల, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాలు, కాగజ్‌నగర్ నియోజకవర్గంలో కాగజ్‌నగర్, బె జ్జూర్, కౌటాల, సిర్పూర్(టి), దహెగాం మం డలాలు, చెన్నూర్ నియోజకవర్గంలో చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి మండలాలు, బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి, నెన్నె ల, భీమిని, కాసిపేట, తాండూర్, వేమనపల్లి మండలాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, రెబ్బెన, తిర్యా ణి, నార్నూర్, జైపూర్, సిర్పూర్(యు) మండలాలు వస్తాయి.
 
 రామగుండం, మంథని గ్రామాల విలీనం?
 చరిత్ర చెప్తున్న సత్యాల ప్రకారం 1905లో ఆదిలాబాద్ జిల్లా ఏర్పడింది. 1940 వరకు ఆసిఫాబాదే జిల్లా కేంద్రంగా కొనసాగుతూ వ చ్చింది. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం గా మారింది. జిల్లా విస్తీర్ణం 16,128 కిలో మీటర్లు కాగా జనాభా 29,35,967. భౌగోళికంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తూర్పు జిల్లాకు ఎంతో దూరంగా ఉంటుంది. జిల్లాలోని 52 మండలాల్లో 26 మండలాలు తూర్పు జిల్లాలోనే ఉన్నాయి. జన్నారం నుంచి సిర్పూర్ వరకు ఉన్న ఈ మండలాలకు మంచిర్యాల నడిబొడ్డున ఉంటుంది. అయితే జిల్లా కేంద్రం ఆదిలాబాద్ భౌగోళికంగా ఉత్తర ంగా ఈ ప్రాంతానికి సుదూరంలో ఉన్నది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి గడించిన మంచిర్యాల జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ఎంతగానో ఉందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.
  ఏళ్ల తరబడిగా తూర్పు జిల్లా పరిధిలోని వేమనపల్లి మండల వాసులు జిల్లాకేంద్రానికి వెళ్లాలంటే 280 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు మంచిర్యాల, చెన్నూరులను కలుపుకుని ఉన్న రామగుండం, మం థని నియోజకవర్గాలకు చెందిన కొన్ని గ్రామాలను మంచిర్యాల జిల్లాలో విలీనం చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా అప్పుడు ఊపందుకుంది. ఏదేమైనా రాష్ర్ట విభజన, తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు తధ్యమన్న చర్చ జోరందుకోగా... అప్పుడే రాజకీయ పార్టీలు సైతం లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి.
 

మరిన్ని వార్తలు