అశోక్బాబు రాజకీయ ప్రవేశానికే అఖిలపక్షం: ఏపీఎన్జీవోలు

21 Dec, 2013 14:55 IST|Sakshi

ఏపీఎన్జీఓల అఖిలపక్ష సమావేశంపై తమ జిల్లా నేతలెవ్వరికీ సమాచారం లేదని ప్రకాశం జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బషీర్‌ తెలిపారు. ఈ సమావేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎప్పుడో నిర్వహించాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారని, సమైక్య ఉద్యమం మొదలైనప్పుడే ఇలాంటి సమావేశం జరగాలని ఆయన చెప్పారు. ఏపీఎన్జీవో ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయనగా ఇప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని బషీర్‌ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమం ఒక్కసారిగా పడిపోవడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.

సమైక్య ఉద్యమం, ఉద్యోగుల డిమాండ్ల సాధనలో ప్రస్తుత నాయకత్వం విఫలమైందని, సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో నాయకులు తెరచాటు రాజీకీయాలు నడిపారని బషీర్‌ ఆరోపించారు. సమైక్య ఉద్యమాన్ని మళ్లీ ఉద్దృతంగా నడపాలని ఉద్యోగులంతా కోరుతున్నారన్నారు. ఉద్యమంలో రాజకీయ నాయకులందర్నీ కలుపుకుపోతామని, ఏపీఎన్జీవో ఎన్నికల్లో తమ ప్యానెల్‌ నిలబడుతోందని వివరించారు.

అలాగే, ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాన్ని ఉద్ధృతంగా తీసెకెళ్లాల్సిన సమయంలో ఏపీఎన్జీవో ఎన్నికలు ప్రకటించారని, అందరూ సమైక్యంగా ఉండాల్సిన సమయంలో అశోక్‌బాబు ఎన్నికల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారని నెల్లూరు ఏపీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌బాబు తెలిపారు. ఉద్యమం నీడన లబ్ధిపొందే ఎత్తుగడలో భాగంగానే అశోక్‌బాబు దొడ్డిదారిని ఎంచుకున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అంటరాని వాటిగా చూశారని, ఉద్యమాన్ని గొప్పగా నడిపే అవకాశాన్ని అశోక్‌బాబు ఎప్పుడో వదులుకున్నారని రవీందర్‌బాబు మండిపడ్డారు. రాజకీయనాయకులకు, ఉద్యోగుల మధ్య పెద్ద అగాధాన్ని అశోక్‌బాబు సృష్టించారని, తన రాజకీయ ప్రవేశం కోసం, పొలిటికల్‌ మైలేజీ కోసం ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు.  అఖిలపక్ష సమావేశానికి వచ్చిన రాజకీయ పార్టీల లక్షణాలను, లక్ష్యాలను పరిశీలించి చూడాలని, అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రవిభజనలో ప్రధాన భూమిక కాంగ్రెస్‌ పార్టీదేనని, విభజనకు లేఖ ఇచ్చిన పార్టీ టీడీపీ ప్రతినిధులు అఖిలపక్షంలో రోజూ చేసే భజనే చేస్తారని రవీందర్‌రావు అన్నారు. పూర్తిగా రాష్ట్ర విభజనకే సై అన్న బీజేపీని అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలిచారో ఏపీ ఎన్జీవో నేతలకే తెలియాలని, ఉద్యోగులకు ఇలాంటి నేతలు ఉండడం తమ దౌర్భాగ్యమని రవీందర్‌బాబు వాపోయారు. సమైక్యం కోసం మొదటనుంచీ పోరాడుతున్న వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం లేకుండా ఏ అఖిలపక్ష సమావేశానికీ పరిపూర్ణతరాదని ఆయన అన్నారు. రాజకీయ రంగప్రవేశానికి అశోక్‌బాబు ఆడుతున్న నాటకం, డ్రామాలో భాగమే ఈ అఖిలపక్ష సమావేశమని ఆయన చెప్పారు.

సమైక్య ఉద్యమం తగ్గిపోవడానికి అశోక్‌బాబే కారణమని ఏపీ ఎన్జీవో హైదరాబాద్‌ అధ్యక్షుడు పి.వి.సత్యన్నారాయణ ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం అకుంఠిత దీక్షతో పోరాడతామని, నాయకత్వ మార్పుతో తిరిగి ఉద్యమం ఉద్ధృతం అవుతుందని ఆయన అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా