అన్నీ అమ్మకాలే!

18 Jan, 2014 02:40 IST|Sakshi

 అంగన్‌వాడీ నియామకాలలో నిబంధనలు గాలికి వదిలేశారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వారికి, అదీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అత్యధిక పోస్టులు కట్టబెట్టేశారు. ఒక్కో పోస్టును రూ.50 వేల నుంచి రూ.70 వేల దాకా అమ్ముకున్నారు. ఇందులో హిందూపురం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఆంతరంగికుడు చక్రం తిప్పగా.. ముఖ్య అధికారి, ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేసేశారు. గత ఏడాది రెండు విడతలుగా జరిగిన ఈ అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వచ్చాయి. అర్హత ఉండి ఉద్యోగాలు పొందలేకిపోయిన వారు సమాచార హక్కు చట్టం కింద నియామకాల ప్రక్రియ ఏ విధంగా సాగిందో బయటకు తీశారు. వీటి ఆధారంగా బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
 
 హిందూపురం మునిసిపాలిటీ, న్యూస్‌లైన్ : హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న 247 (మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు-94, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు-46, సహాయకులు-107) పోస్టుల భర్తీకి 2011 జనవరి 12న దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు 2013 ఫిబ్రవరి 5న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 245 పోస్టులు భర్తీ చేశారు. రెండో విడతలో 85 (మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు 23, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు 27, సహాయకులు-35) పోస్టుల భర్తీకి 2013 జూలై4న నోటిఫికేషన్ విడుదలైంది.
 
 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి అదే ఏడాది నవంబర్ 15న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 59 పోస్టులు భర్తీ చేశారు. 29 పెండింగ్‌లో ఉన్నాయి. ఇంటర్వ్యూ బోర్డులోని ఓ ముఖ్య అధికారి, నియోజకవర్గ ప్రజాప్రతినిధి కలిసి ముందుగా నిర్ణయించుకున్న వారికే మిగతా సభ్యులు ఆమోదముద్ర వేసేలా ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిభ ఉన్నా తమను పక్కకు పెట్టారంటూ హిందూపురం, చిలమత్తూరు మండలాలకు చెందిన దాదాపు పది మంది కోర్టుకెళ్లారు.
 
 తాజాగా 36 పోస్టులకు నోటిఫికేషన్
 హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో తాజాగా 36 (మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు -8, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు -8, సహాయకులు-20) అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూ తేదీని ఖరారు చేయాల్సి ఉంది.  ఈసారైనా ఉన్నతాధికారులు అక్రమాలకు చెక్‌పెట్టి.. ప్రతిభ, అర్హత ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
 
 అన్యాయం చేశారు
 హిందూపురంలోని మోడల్‌కాలనీ-2 అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. పదోతరగతిలో 352 మార్కులు వచ్చాయి. అనుభవం మార్కులు చూసుకుంటే ప్రస్తుతం నియమించిన కార్యకర్తకంటే నాకే ఎక్కువ. ఎంపిక చేసిన కార్యకర్త వివరాలను అడిగితే అధికారులు ఇవ్వడంలేదు. దీంతో నేను హైకోర్టును అశ్రయించి స్టే తీసుకొచ్చాను. అయినా అధికారులు స్పందిస్తున్న దాఖలాల్లేవ్.
 - జె.శోభావతి, బాధితురాలు
 
 సున్నా మార్కులు వేశారు
 హిందూపురం పట్టణంలోని సత్యసాయికాలనీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టుకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నాం. అందులో పదో తరగతిలో 418 మార్కులతో నేనే అందరికన్నా ముందు న్నా. ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాను. అయితే నాకు ఎమ్మెల్యే 0, ఐసీడిఎస్ అధికారులు 0 మార్కులు వేశారు. ప్రస్తుతం ఈ పోస్టుకు ఎంపిక చేసిన ఆమె కన్నా నాకు పదో తరగతిలో 101 మార్కులు ఎక్కువ. విద్యావలంటీర్‌గా కూడా పని చేశాను. అయినా నన్ను ఎంపిక చేయలేదు. ఈ అక్రమ నియామకంపై న్యాయ పోరాటం చేస్తా.               
 - ప్రశాంతి, బాధితురాలు
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు