సర్పంచులు.. పారా హుషార్

13 Dec, 2013 00:38 IST|Sakshi

 మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :  
 సర్పంచ్.. గ్రామ ప్రథమ పౌరుడు. ప్రధానమంత్రికి చెక్‌పవర్ లేదు కానీ సర్పంచ్‌కు ఉంది. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు మహాత్ముడు. అలాంటి గ్రామాల్లో సర్పంచులు విధి నిర్వహణలో.. నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్తగా ఎన్నికైన వారు.. ముఖ్యంగా మహిళా సర్పంచులకు నిధులు, విధులపై అవగాహన తక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఎన్నికలు ముగియగానే అవగాహన శిబిరాలు నిర్వహించింది. నిధులు, విధులు, బాధ్యతలపై శిక్షకులు వివరించారు. అయినప్పటికీ పూర్తి అవగాహనకు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోపు తెలిసీ తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని చట్టం సూచిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం నిధులకు సంబంధించిన జీవో 431 అధికారులను అప్పగిస్తూ ప్రత్యేకంగా 432 ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు ఆ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈసారి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో సగం మంది మహిళా సర్పంచులు ఉన్నారు. నిధులు ఎలా ఖర్చు చేయాలి, వాటి పర్యవేక్షణ, వేతనాల చెల్లింపు, పరిపాలన ఇలా అనేక బాధ్యతలు కత్తిమీద సాములా మారాయి.
 
 అభివృద్ధి పనుల ఆమోదంపై జాగ్రత్త
 గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే ముందు అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి. రహదారి, మురికి కాలువ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలి. ఆయా విభాగాల సాంకేతిక నిపుణులు అంచనా వ్యయం నిర్దేశించి నివేదిక ఇస్తారు. ఇంజినీరింగ్ అధికారి అభివృద్ధి పని విలువని మెజర్‌మెంటు(ఎం) పుస్తకంలో నమోదు చేస్తారు. ఉప కార్యనిర్వహణ ఇంజినీర్ పని నాణ్యతను పరిశీలిస్తారు. ఏ పని చేయాలన్నా ముందుగా పాలకవర్గంలో మెజార్టీ సభ్యుల ఆమోదం పొందాలి. రూ.రెండు లక్షల లోపు నిధులు వ్యయం చేసే పనులకు పాలకవర్గం నిర్ణయం సరిపోతుంది. అంతేకంటే ఎక్కువ నిధులు అవసరమైతే డివిజనల్ లేదా జిల్లా అధికారుల అనుమతి పొందక తప్పదు.
 
 నిధుల ఖర్చులో నియమాలు
 పంచాయతీలకు ఇంటి, వేలం తదితర పన్నుల రూపంలో వచ్చే నిధులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. నిధులు వ్యయం చేస్తే వాటి వివరాలతో కూడిన వినిమయ ధ్రువపత్రాన్ని జిల్లా ఈవోపీఆర్‌డీకి డిసెంబర్ మాసం నాటికి సమర్పించాలి. ఏటా డిసెంబర్‌లో ఆదాయం, కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులు, వాటి వ్యయాలు ఆడిట్ చేయించాలి. లేకపోతే బ్లాక్ లిస్టులో పెడతారు.
 
 ఏడాదికి నాలుగుసార్లు గ్రామసభలు
 యేడాదికి నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జనవరి రెండు, ఏప్రిల్ 14, జూలై ఒకటి, అక్టోబర్ 3వ తేదీలలో గ్రామ సభలు నిర్వహించాలి. వాటిని ఫొటోలు తీసి, గ్రామసభలో ప్రజల అభిప్రాయాలు, వివరాలను జిల్లా అధికారులకు తెలియజేయాలి. సర్పంచు పక్షం రోజులు స్థానికంగా అందుబాటులో లేకపోతే సెలవు పెడుతూ, బాధ్యతలను ఉపసర్పంచుకు అప్పగించాలి. సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిస్తే కార్యదర్శి ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. లేకపోతే పంచాయతీల్లో ఏ తప్పు జరిగినా కార్యదర్శిని బాధ్యులుగా చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవడానికి పాలకవర్గం ముందస్తు ప్రణాళిక వే సుకోవాలి.
 
 ఖర్చులకు పరిమితం
 గ్రామ పంచాయతీలకు నిధులు ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వమే నిర్దేశించింది. వేటికి ఎంత శాతం నిధులు కేటాయించాలో స్పష్టంగా పేర్కొంది. వేతనాలకు 30శాతం, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యానికి 15 శాతం, అభివృద్ధి పనులకు 20 శాతం, చిల్లర ఖర్చులు, స్టేషనరీ సామగ్రి కొనుగోలుకు ఐదు శాతం నిధులు ఖర్చు చే సుకోవచ్చు.
 
 ఐఎస్‌ఐ వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలి
 పంచాయతీలకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, ట్యూబ్ లైట్లు ఇతర పరికరాలు, సామగ్రి కొనుగోలు చేసే ముందు నిబంధనలు తెలుసుకోవాలి. కలెక్టర్ సూచించిన అధీకృత డీలర్ల వద్దనే ఐఎస్‌ఐ మార్కు ఉన్నవి కొనాలి. నాసిరకం కొనుగోలు చే స్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తేడా వస్తే పదవికే ఎసరు వచ్చే అవకాశాలున్నాయి. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన పరికరాలు, వస్తువుల నిల్వలు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అధికారులు తనిఖీకి వస్తే స్టాక్ రిజిస్టర్ ఆధారంగా కొనుగోలు చేసిన, నిల్వ ఉన్న వివరాలు పారదర్శకంగా ఉంటాయి.
 
 చెక్ పవర్ విషయంలో..
 చెక్ పవర్ వినియోగం విషయంలో సర్పంచులు జాగ్రత్తగా ఉండాలి. గతంలో చెక్‌పవ ర్ కార్యదర్శి, సర్పంచ్‌కు ఉమ్మడిగా ఉండేది. సర్పంచుల విన్నపం మేరకు ప్రభుత్వం సర్పంచులకే చెక్ పవర్ కల్పించింది. ఈ తరుణంలో చెక్ వినియోగించే ముందు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా కొనుగోలుకు సంబంధించిన పేమెంట్ ఇవ్వాలంటే చెక్‌తో బ్యాంక్‌ల ద్వారానే జరగాలి. చెక్కులపై సంతకం పెట్టే ముందు అన్నీ పరిశీలించాలి. సిబ్బందికి వేతనాల చెల్లింపులు కూడా చెక్కుల రూపంలోనే జరగాలి. ప్రభుత్వం, కలెక్టర్ నియమించిన పార్ట్‌టైం, కాంట్రాక్టు కార్మికులకు మాత్రమే వేతనాలు చెల్లించాలి. పంచాయతీ రికార్డులు ఇంటి వద్ద పెట్టుకోవడం నేరంగా పరిగణిస్తారు. పంచాయతీ కార్యాలయాల్లోనే వాటిని ఉంచడం శ్రేయస్కరం.
 

మరిన్ని వార్తలు