సేవలకు సెలవు

31 May, 2014 01:46 IST|Sakshi
సేవలకు సెలవు

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి దాదాపు అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. మూడు  రోజులపాటు ఈ సేవలు ప్రజలకు అందే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూన్ రెండు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతున్నందున రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అన్ని శాఖలకు చెందిన కొత్త అకౌంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లు కేటాయించి ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసేందుకు వీలుగా అన్ని శాఖల సేవలను నిలిపివేశారు.

ఈ నెల 31, జూన్ ఒకటి తేదీల్లో సేవలు నిలిపివేస్తామని.. రెండో తేదీన అవి పునఃప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ.. ఆరోజు కార్యాలయాలు తెరిచి సర్వర్లు ఆన్ చేసి.. ఖాతాలు, కోడ్ నెంబర్లు తెలుసుకునేసరికే పుణ్యకాలం గడిచిపోతుందని, అందువల్ల ఆ రోజు కూడా సేవల పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా మీ సేవ, ఈ సేవ కేంద్రాలు పని చేయకపోవడం వల్ల దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. దీంతోపాటు మున్సిపల్, రిజిస్ట్రేషన్, రవాణా సేవలు శుక్రవారం సాయంత్రం పనివేళలు ముగిసిన వెంటనే నిలిచిపోయాయి.


ఖజానా శాఖలో మార్పుచేర్పుల కోసం నాలుగు రోజుల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశారు. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల బిల్లుల స్వీకరణ, చెల్లింపులు నిలిచిపోయాయి. కొత్త ఖాతాలు ప్రారంభమయ్యే వరకు చెల్లింపులు జరగవని తెలియడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అందించే సేవలు.. భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, తనఖాలు, వివాహా ధ్రువపత్రాలు, ఈసీలు, నకళ్ల జారీ వంటి సేవలు కూడా స్తం భించాయి. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు, వివాహ రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బంది పడే అవకాశముంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయం కూడా నిలిచిపోనుంది.


మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో మెజారిటీ ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. అత్యధిక ప్రభుత్వ శాఖల లావాదేవీలను ఈ కేంద్రాలతో అనుసంధానం చేయడం వల్ల గత రెండేళ్లుగా ప్రజలు అన్ని రకాల సేవలను వీటి ద్వారానే పొందుతున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు శాఖలతోపాటు పలు ఇతర శాఖల సేవలకు సంబంధించి సుమారు వంద రకాల సేవలు మీ సేవ ద్వారానే అందుతున్నాయి. జూన్ రెండో తేదీ వరకు ఇవన్నీ నిలిచిపోతాయి. జూన్‌రెండు ఆ తరువాత కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లతో పునఃప్రారంభమవుతాయి.

మరిన్ని వార్తలు