పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు

11 Apr, 2019 04:16 IST|Sakshi
గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధమైన పోలీసులు

గత ఎన్నికల కన్నా ఈసారి బలగాలు తక్కువే

ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు బలగాలు, డ్రోన్లతో నిఘా

ఏ క్షణమైనా బలగాలు వెళ్లేలా విశాఖ, రాజమండ్రిలో రెండు ప్రత్యేక హెలికాప్టర్లు సిద్ధం

సమస్యలపై తక్షణం స్పందించేలా డయల్‌ 100, 1050, 1090 వినియోగం

ఎన్నికల వేళ అలజడులన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆరా

ఉ.11 గంటల్లోపు సొంత ఓటింగ్‌ వేయించుకుని ఆపై అలజడులకు స్కెచ్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బలగాలు తక్కువగానే వచ్చినప్పటికీ బందోబస్తు ఏర్పాట్లు పక్కాగానే చేసినట్టు ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తు కోసం 296 కంపెనీల ప్రత్యేక బలగాలు కావాలని ఎన్నికల అధికారులు ప్రతిపాదించారు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఎన్నికలు జరుగుతున్నందున ఏపీకి 197 కంపెనీల కేంద్ర బలగాలను మాత్రమే కేటాయించారు. 2014లో తొలివిడత ఎన్నికలు తెలంగాణలో పూర్తయిన తరువాత 27 వేల మంది పోలీస్‌ సిబ్బందిని ఏపీకి తరలించడంతో అప్పట్లో పెద్దగా ఇబ్బందులు రాలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరుగుతుండడంతో రాష్ట్రానికి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ నుంచి 197 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ప్రత్యేక బలగాలు వచ్చాయి. అంతేకాక.. ఏపీలోని పోలీసు బలగాలు, ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌తోపాటు మాజీ సైనికులు, యూనిఫారం సిబ్బంది, ఎన్‌సీసీ వంటి వారి సేవలను కూడా ఈసారి ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా 1200 బాడీవోర్న్‌ కెమెరాలు, 67 డ్రోన్‌ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ఎన్నికల విధుల్లో వినియోగించే 2,684 వాహనాలకు జీపీఎస్‌ను ఏర్పాటుచేశారు. తక్షణ స్పందన కోసం డయల్‌ 100, 1050, 1090 సేవలను వినియోగిస్తున్నారు. వీటికి ఇప్పటివరకు 1,01,133 కాల్స్‌ రాగా వాటిలో 65,750 కాల్స్‌ నిజమైనవిగా నిర్ధారించారు. కాగా, మంగళవారం వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 4501 కేసులు నమోదయ్యాయి.   

మావోయిస్టు ప్రాంతాల్లో హైఅలర్ట్‌..
ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారును మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేసిన ఘటన తెల్సిందే. ఈ ఘటనలో ఎమ్మెల్యేతోపాటు నలుగురు మృతి చెందారు. దీనికితోడు ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోలు కాల్చి చంపిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర సరిహద్దున ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. 520 పోలింగ్‌ ప్రాంతాల్లో సెంట్రల్‌ పారా మిలటరీ బలగాలు, గ్రేహౌండ్స్‌ బలగాలు, డ్రోన్‌ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం షాపులతో పాటు సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లోని ఐదు కిలోమీటర్ల మేర మద్యం షాపులు మూసివేసేల చర్యలు తీసుకున్నారు. వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు.  

చంద్రబాబు వ్యాఖ్యలపై అప్రమత్తం
రాష్ట్రంలో ఈసారి అలజడులు జరుగుతాయంటూ రెండ్రోజులుగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఉ.7 గంటల నుంచి 11 గంటల వరకు తమకు అనుకూలంగా ఉన్న వారితో ఓట్లు వేయించుకుని ఆ తరువాత అలజడులు సృష్టించే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందింది. కొన్ని ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా అలజడులు రేపి వ్యతిరేక ఓటింగ్‌ జరగకుండా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అప్పటికే వేయించుకున్న అనుకూల ఓట్లతో గట్టెక్కడమా? లేదంటే అక్కడి రీ పోలింగ్‌ జరిగే పరిస్థితులు కల్పించడమా? అనే విషయంలో కొందరు వ్యూహాలు పన్నుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. దీంతో ఇప్పటికే గుర్తించిన 8,514 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో అలజడులు జరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలపై పోలీసు, ఎన్నికల అధికారులు ఓ కన్నేశారు.

మరిన్ని వార్తలు