సమగ్ర భూ సర్వేకు కసరత్తు!

25 Jul, 2019 11:17 IST|Sakshi
మచిలీపట్నంలోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయం

వందేళ్ల తర్వాత సర్వే దిశగా ప్రభుత్వం అడుగులు

డివిజన్‌కు ఒక గ్రామంలో ప్రయోగాత్మకంగా సర్వే

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే సర్వే

సాక్షి, మచిలీపట్నం: గజం భూమి కన్పిస్తే చాలు పాగా వేసేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గడిచిన ఐదేళ్లుగా వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టారు. అధికారుల అండ దండలతో రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి ప్రభుత్వ, ప్రైౖవేటుభూముల కబ్జాలకు తెగపడ్డారు. సామా న్య, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చలగాట మాడారు. సెంటు భూమి కోసం కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది.

భూ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం చూపే దిశగా సమగ్ర భూ పరిరక్షణా చట్టాన్ని తీసుకు వస్తోంది. ఈ మేరకు రూపొందించిన ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు–2019 ముసాయిదా బిల్లుకు ఇటీవలే రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. భూముల యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న భూ తగాదాలకు పరిష్కారం చూపడం, భవిష్యత్‌లో పత్రాలు, భూ రికార్డులు ట్యాంపరింగ్‌ కాకుండా నిరోధించేందుకు వీలుగా ఈ చట్టాన్ని రూపొందించనున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కూడా కసరత్తు మొదలు పెట్టింది.

బ్రిటీష్‌ హయాంలోనే సమగ్ర సర్వే
భూముల సర్వేకు పెద్ద చరిత్రే ఉంది. బ్రిటీష్‌ పాలనకు ముందు అక్బర్‌ హయాంలో పన్నులు వేసేం దుకు తొలిసారి బ్లాక్‌ సర్వే జరిగింది. ఆ తర్వాత బ్రిటీష్‌ హయాంలో 1900లో చేపట్టిన సమగ్ర భూ సర్వే 1923 వరకు సాగింది. చేర్పులు, మార్పుల అనంతరం 1932లో పూర్తిస్థాయిలో రీ సెటిల్‌ మెంట్‌ రిజిస్ట్రర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎస్టేట్‌ ఎబాలిష్‌మెంట్‌ యాక్టు–1956ను తీసుకొచ్చారు. 

విలేజ్‌ మ్యాప్స్, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్స్‌ (ఎఫ్‌ఎంబీ),రీ సెటిల్‌మెంట్‌ రిజిస్ట్రర్స్‌ (ఆర్‌ఎస్‌ ఆర్‌), సెటిల్‌మెంట్‌ కాని భూములను ఫెయిర్‌ ల్యాండ్‌ రిజిస్ట్రర్స్‌ (ఎఫ్‌ ఎల్‌ఆర్‌) ఆధారంగానే భూములను గుర్తిస్తారు. వీటి ఆధారంగానే రెవెన్యూ రికార్డ్స్‌ రూపొందిస్తారు. గడిచిన ఐదేళ్లలో వెలుగు చూసిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జా వివా దాలను దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి రాగానే సమగ్ర భూ పరిరక్షణ చట్టం తీసుకొస్తానని, రీ సర్వే జరిపిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్ర సభల్లో స్పష్టమైన హామీ ఇచ్చారు.

నాలుగు గ్రామాల ఎంపిక
ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సమగ్ర భూ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో భూముల సమగ్ర సర్వేకు జిల్లా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వాదేశాల మేరకు ప్రయోగాత్మకంగా సర్వే చేసేందుకు డివిజన్‌ కో గ్రామాన్ని ఎంపిక చేసింది. విజయవాడ డివిజన్‌లో కంకిపాడు మండలం కొణతనపాడు, గుడివాడ డివిజన్‌లో పామర్రు మండలం పోలవరం, మచిలీపట్నం డివిజన్‌ గూడూరు మండలం గురిజేపల్లి, నూజివీడు మండలం మర్రిబందు గ్రామాలను ఎంపిక చేశారు. కొణతనపాడులో 127, పోలవరంలో 55, గురిజేపల్లిలో 51, మర్రిబందులో 81 సర్వే నెంబర్లున్నాయి. పైగా ఈ గ్రామాలన్నీ 500   ఎకరాల విస్తీర్ణం లోపలే ఉన్నాయి.

జియోట్యాగింగ్‌ ద్వారా సరిహద్దుల గుర్తింపు
సమగ్ర సర్వేలో సర్వే విభాగంతో పాటు రెవెన్యూ, పంచాయతీ ఇతర శాఖలు కూడా భాగస్వాములను చేయనున్నారు. అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టం ద్వారా సరిహద్దులను గుర్తించి జియో ట్యాగింగ్‌ చేస్తారు. ప్రయోగాత్మక సర్వేనంతరం సాధక బాధకాలపై అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత జిల్లాస్థాయిలో సర్వేకు ఎంత సమయం పడుతుంది? ఎన్ని బృం దాలు కావాలి? ఎంత వ్యయం అవుతుంది? అనే దానిపై కసరత్తు జరుగుతుంది. ఆ తర్వాత ఈ సమగ్ర సర్వేను మన యంత్రాంగంతోనే చేసేం దుకు ఏ మేరకు అవకాశాలున్నాయి లేదంటే ఏదైనాప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలా? అనే అంశం పై కసరత్తు చేపడతారు. జిల్లాస్థాయిలో సమగ్ర సర్వే జరపాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో భూముల వివరాలు

డివిజన్లు 4
మండలాలు 50
పంచాయతీలు 980
రెవెన్యూ గ్రామాలు 1005
మున్సిపాల్టీలు  9
జిల్లా భౌగోళిక విస్తీర్ణం 8727 చదరపు కిలోమీటర్లు
జిల్లా విస్తీర్ణం 8,34,159 హెక్టార్లు
గ్రామ పటాలు (విలేజ్‌ మ్యాప్స్‌)  1005
సర్వే నెంబర్లు 3,15,153
ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్స్‌ (ఎఫ్‌ఎంబీ) 3,15,153
సబ్‌ డివిజన్స్‌ 10,08,552
భూ ఖాతాలు 7,02,649
ఇనాం భూములు  26,214.49 ఎకరాలు
ఎస్టేట్‌ భూములు  11,28,188.73 ఎకరాలు
ప్రభుత్వ భూములు  9,05,971.23 ఎకరాలు
వ్యవసాయ భూములు 13,36,241.60 ఎకరాలు
వ్యవసాయేతర భూములు 1,17,160.80 ఎకరాలు
ఎస్సెస్డ్‌ వేస్ట్‌ల్యాండ్స్‌ 43,768.76 ఎకరాలు
అన్‌ ఎస్సెస్డ్‌ వేస్ట్‌ ల్యాండ్స్‌  35,171.11 ఎకరాలు
దేవాదాయ భూములు 24,197.73 ఎకరాలు
వక్ఫ్‌ బోర్డు భూములు  1810.73 ఎకరాలు
అటవీ భూములు 1,03,158.13 ఎకరాలు
ల్యాండ్‌ సీలింగ్‌ భూములు 8334.98 ఎకరాలు
ఎసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌  86,449.83 ఎకరాలు
సోషల్‌ వెల్ఫేర్‌ ల్యాండ్స్‌ 3800.79 ఎకరాలు 
మరిన్ని వార్తలు