తెప్పోత్సవానికి చకచకా ఏర్పాట్లు

7 Oct, 2019 20:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైనా మంగళవారం నిర్వహించనున్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విద్యుత్‌ దీపాలంకరణ చేసిన హంస వాహనంపై ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాముల వారు కృష్ణానదిలో విహరించనున్నారు. కృష్ణానదిలో వరద ప్రవాహం ఉండటంతో దుర్గ గుడి అధికారులు తెప్పోత్సవానికి నీటిపారుదల శాఖ అనుమతి తీసుకున్నారు. అనంతరం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

ఈ ట్రయల్‌ రన్‌లో డీసీపీ విజయరావు, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్‌రావు మాట్లాడుతూ.. కృష్ణానదిలో 40 నిమిషాల పాటు హంస వాహనం ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్టు తెలిపారు. తెప్పోత్సవం సందర్భంగా 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హంస వాహనంపై 32 మందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు