హైటెక్ పల్లెలు

15 Jan, 2015 00:09 IST|Sakshi
హైటెక్ పల్లెలు

18న స్మార్ట్ విలేజ్, వార్డుల కార్యక్రమానికి సర్కారు శ్రీకారం
దత్తతకు 12,918 గ్రామాలు, 3,465 వార్డులు
అధికారులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్లు దత్తత తీసుకోవాలన్న ప్రభుత్వం
ఐదేళ్లలో అన్నివిధాలా తీర్చిదిద్దితే స్మార్ట్ విలేజ్‌గా ప్రకటన
కలెక్టర్లకు ప్రణాళికా శాఖ మెమో
18న పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో బాబు పాదయాత్ర


సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా రాష్ట్రంలోని పల్లెల్లో హైటెక్ హంగుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆధునిక వసతులతో పాటు గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనీస సదుపాయాలు, సామాజిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకోసం జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీలను, వార్డులను మూడు రకాలుగా వర్గీకరించింది. 5 వేల జనాభా గల గ్రామాలు, వార్డులను అధికారులు, దాతలు, వ్యక్తులు దత్తత తీసుకోవాలి.

10 వేల జనాభా గల గ్రామాలు, వార్డులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దత్తత తీసుకోవాలి. ఇక 10 వేలపైన జనాభా గల గ్రామాలు, వార్డులను కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామాలు, 3,465 వార్డులను దత్తత ఇవ్వనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆయా గ్రామాలు, వార్డులను 20 అంశాల్లో రాజీపడకుండా తీర్చిదిద్దాలి. అప్పుడు ఆ గ్రామాలను, వార్డులను స్మార్ట్ గ్రామాలు, వార్డులుగా ప్రకటిస్తారు.

18వ తేదీన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ప్రజల్లో కార్యక్రమం గురించి తెలియజేయడానికి పాదయాత్ర కూడా చేస్తారని జిల్లా కలెక్టర్లకు పంపిన మెమోలో ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ పేర్కొన్నారు. జిల్లాల్లో మంత్రులు కార్యక్రమాన్ని ప్రారంభించి పాదయాత్రలు నిర్వహించాలని మెమోలో సూచించారు. పాదయాత్రల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, దత్తత తీసుకునే ఇతర ప్రతినిధులతో వర్క్‌షాపు నిర్వహించి వారి నుంచి వచ్చిన సూచనలు, సలహాలను వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కలెక్టర్లను కోరారు.

గ్రామాలను దత్తత తీసుకోవడానికి అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, కార్పొరేట్ సంస్థలు, సినీ రంగానికి చెందిన వారు, మీడియా, పేరు ప్రతిష్టలు గల స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇలావుండగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్ను గ్రామంలో పాదయాత్ర చేస్తారని సీఎం కార్యాలయవర్గాలు తెలిపాయి.  

స్మార్ట్ గ్రామాలు, వార్డుల్లో సాధించాల్సిన ముఖ్య లక్ష్యాలు..
#  అందరికీ కనీసం ఒక పడక గది, వంటగ ది, మరుగుదొడ్డి, మంచినీరు, విద్యుత్ సౌకర్యంతో కూడిన ఇల్లు
#  పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో మరుగుదొడ్డి, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పన
#  గ్రామంలో సమాచార కేంద్రం, విలేజ్ కంప్యూటర్ ల్యాబ్, మీ సేవ కేంద్రంఏర్పాటు

# టెలికం, ఇంటర్నెట్ కనెక్టివిటీ. కాన్పులన్నీ ఆరోగ్య కేంద్రాల్లో జరగాలి. కాన్పుల సమయంలో మాతా, శిశు మరణాలు ఉండకూడదు.
# ఐదేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందుబాటులో ఉండాలి. 12వ తరగతి వరకు సూల్ డ్రాపవుట్స్ ఉండరాదు
# బాల్య వివాహాలు ఉండరాదు. చిన్న తరహా పరిశ్రమల ద్వారా ప్రతి ఒక్కరికీ జీవనోపాధి అవకాశాలు కల్పించాలి.

# ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా  ఉండాలి.
# గ్రామ సభ ఏడాదికి కచ్చితంగా నాలుగుసార్లు జరగాలి
# సమస్యల పరిష్కార వ్యవస్థ, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, సూక్ష్మ బ్యాంకు, ఏటీఎం ఉండాలి.
# ప్రతి ఇంటికీ పైపుల ద్వారా కుళాయి మంచినీటి సౌకర్యం కల్పించాలి

# అంతర్గత రహదారులు, డ్రేనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
# సౌర విద్యుత్‌తో వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్, స్వయం సహాయ సంఘాలకు భవనం ఉండాలి.
# క్రీడా పాంగణం-శ్మశాన వాటిక, మార్కెట్, ప్రజాపంపిణీ ఔట్‌లెట్, పోస్ట్ ఆఫీసు ఉండాలి.
# ప్రతి కుటుంబం, జీవిత బీమా, వైద్య బీమా కలిగి ఉండాలి

# ప్రతి ఒక్కరికీ ఏడాదిలో కనీసం వంద రోజులు ఉపాధి కల్పించాలి
# జనన, మరణాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి.
# ఏదైనా గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, ప్రజా పంపిణీ షాపు, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూలు, గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఆ గ్రామానిక ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు