స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

12 Aug, 2019 04:54 IST|Sakshi
ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

సీఎం హోదాలో తొలిసారిగా ఆగస్టు 15 వేడుకల్లో వైఎస్‌ జగన్‌

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు 

వారం రోజులుగా పరేడ్‌కు రిహార్సల్స్‌

ముస్తాబవుతున్న 13 శాఖల శకటాలు

సాక్షి, అమరావతి : ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వీవీఐపీలు, విద్యార్థులు పాల్గొనే ఈ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు.. పంద్రాగస్టు రోజున దేశంలో ఉగ్రవాదుల దాడులు చోటుచేసుకునే అవకాశముందని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వేడుకలు జరుగుతున్న మున్సిపల్‌ స్టేడియంతోపాటు నగరంలోనూ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్‌ వంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పరేడ్‌ కోసం గత వారం రోజులుగా మున్సిపల్‌ స్టేడియంలో రిహార్సల్స్‌ చేస్తున్నారు. అలాగే, శాఖల వారీగా ప్రభుత్వ పథకాలను వివరించే ప్రత్యేక శకటాలు రూపుదిద్దుకుంటున్నాయి.

ఈసారి 13 శకటాలు ప్రదర్శించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, భారీ వర్షాలు కురిస్తే వేడుకలు జరిగే స్టేడియం జలమయం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన అవసరమైన పనులు పూర్తిచేశారు. విజయవాడ నగర పోలీసులు, మున్సిపల్, ఆర్‌ అండ్‌ బీ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి.  

>
మరిన్ని వార్తలు