టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

14 Mar, 2018 09:17 IST|Sakshi
జిల్లా ఎస్పీసర్వశ్రేష్ట్ర త్రిపాఠి

 రేపటి నుంచి 27 వరకు నిర్వహణ  

జిల్లా వ్యాప్తంగా 268 కేంద్రాల ఏర్పాటు

పరీక్ష రాయనున్న 57,127 మంది విద్యార్థులు

సమస్యాత్మకమైన 5 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా

హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

సాక్షి, మచిలీపట్నం:   పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 268 కేంద్రాల్లో ఈ నెల 15 నుంచి పరీక్షలు జరగనున్నాయి. 57,127 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో రెగ్యులర్‌ 56,035 మందికాగా, ప్రైవేట్‌ 1092 మంది ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. మాస్‌కాపీయింగ్‌కు తావులేండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 268 కేంద్రాలకు 268 చీప్‌ సూపరింటెండెంట్‌ అధికారులను నియమించారు. 268 డిపార్ట్‌మెంటర్‌ అధికారులు, 62 మంది కస్టోడియన్, 62 మంది చీఫ్‌ కస్టోడియన్, 2950 మంది ఇన్విజిలేటర్లు, 14 ఫ్లయింగ్‌ స్వాడ్‌ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తారు. 62 పోలీస్‌ స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్ర పరిచారు. జిల్లాలోని ఐదు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో తెలిపారు. జిల్లాలోని ఘంటసాల మండలం  శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ హైస్కూల్, బంటుమిల్లి గరŠల్స్‌ హైస్కూల్‌తో పాటు జగ్గయ్యపేట జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, పెనుగంచిప్రోలు బాలికల ఉన్నత పాఠశాల, ఆగిరిపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

నిబంధనలు ఇవీ..
జంబ్లింగ్‌ పద్ధతిలో ఇన్విజిలేర్లను కేటాయిస్తారు.
ఇన్విజిలేటర్లు, ఉపాధ్యాయేతర సిబ్బందికి పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు అనుమతించరు.
విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, స్టడీ మెటీరియల్, స్మార్ట్‌ వాచ్‌లు, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటలలోపు పరీక్ష కేంద్రం వద్దకు  చేరుకోవాలి.
విద్యార్థినులకు తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మహిళా ఇన్విజిలేటర్లు నియమించారు.
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు వుంటే వాటిని పరీక్ష నిర్వహించే సమయం వరకు మ్యూట్‌లో ఉంచాలి.
పరీక్షా కేంద్రంలో ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉంటే.. పరీక్ష కేంద్రం వద్ద ప్రైవేటు పాఠశాలల సిబ్బంది ఉండకూడదు.
విద్యార్థులను నేలమీద పరీక్ష రాయిస్తే చర్యలు తప్పవని, బెంచీల మీద, సౌకర్యాలున్న గదుల్లోనే పరీక్షలు రాయించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి సెంటర్‌ నిర్వాహకులకు ఆదేశాలందాయి.

పటిష్ట బందోబస్తు :జిల్లా ఎస్పీసర్వశ్రేష్ట్ర త్రిపాఠి
కోనేరుసెంటర్‌: పదో తరగతి పరీక్షలను పురస్కరించుకుని జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట్రతిపాఠి తెలిపారు. విద్య, వైద్య, ఆర్టీసీ అధికారుల సమన్వయంతో పోలీసులు పని చేసేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాఫిక్‌పరంగా సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సమీపంలోని పోలీసు సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల గుంపులుగా కనిపిస్తే పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, మీసేవా సెంటర్‌లను మూసివేయిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు