ప్రజా సే‘నాని’.. సంక్షేమ వారధి..

23 Jul, 2019 14:41 IST|Sakshi
తమ్మిలేరుపై ఉన్న శనివారపుపేట కాజ్‌వే

ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని చొరవతో తమ్మిలేరు కాజ్‌వేపై వంతెనలు

రూ.30 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి ఏర్పాట్లు

తీరనున్న ఏలూరు నగర వాసుల దశాబ్దాల కల

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): తమ్మిలేరు కాజ్‌వేలపై రూ.30 కోట్ల వ్యయంతో రెండు వంతెనలు నిర్మించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇటీవల ప్రకటించారు. దీంతో ఏళ్ల నాటి కల నెరవేరుతుందంటూ ఏలూరు నగర, పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్‌ కాలం నాటి శనివారపు పేట కాజ్‌వేపై వంతెనను నిర్మించాలంటూ ఎన్నోఏళ్లుగా ప్రజలు కోరుతూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి, రాష్ట్ర, కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. గతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఈ వి«షయాన్ని ఆయన దృష్టికి సైతం తీసుకెళ్లారు.

వంతెన నిర్మాణానికి అప్పట్లో రాజన్న సానుకూలంగా స్పందించినా.. తరువాత కొద్ది కాలానికే ఆయన హఠాన్మరణంతో వంతెన నిర్మాణ పనులు అటకెక్కాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోశయ్య, ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి, చంద్రబాబునాయుడు ఏలూరు పర్యటనకు వచ్చిన ప్రతిసారీ వంతెన నిర్మాణంపై  నగరానికి చెందిన పలు సంఘాల నాయకులు కలసి వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నారు. వారు చేద్దామని ఉత్తుత్తి హామీలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ సమస్యకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే  మోక్షం లభించడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రిటిష్‌ కాలం నాటి కాజ్‌వే
బ్రిటిష్‌ కాలం నాటి శనివారపుపేట కాజ్‌వేపై వంతెన నిర్మించాలనే డిమాండ్‌ ఎన్నో ఏళ్ళుగా ఉంది. ఏలూరు పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు నిత్యం ఈ కాజ్‌వేపై ప్రయాణం చేస్తూనే ఉంటారు. వరదలు వస్తే చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీనిపై గతంలో ఇచ్చిన వినతుల మేరకు గత ప్రభుత్వ హయాంలో ఆర్‌అండ్‌బి అధికారులు  నిధులు వచ్చిన వెంటనే వంతెన నిర్మిస్తామంటూ చెబుతూ ఇప్పటి వరకూ మభ్యపెడుతూ వచ్చారు.

ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రకటనతో హర్షం
ఇటీవల ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఎన్నో ఏళ్లుగా ఏలూరు నగర ప్రజలు కోరుతున్నట్టుగా తమ్మిలేరుపై రెండు చోట్ల వంతెనలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా రూ.6.50 కోట్లతో శనివారపుపేట కాజ్‌వేపై, రూ.23 కోట్లతో దత్తాశ్రయం నుంచి తమ్మిలేరుపై చింతలపూడి వెళ్లే రోడ్డుకు కలుపుతూ వంతెనలు నిర్మించాలని ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ్మిలేరుపై రూ.30 కోట్లతో రెండు వంతెనలు నిర్మించనుండటంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నానికి అభినందలు తెలియజేస్తున్నారు. ఆయన ప్రజా స్ఙేనాని’ అని, సంక్షేమ వారధి అని కొనియాడుతున్నారు.

కల నెరవేరనుంది
తమ్మిలేరుపై రెండు చోట్ల వంతెనలు నిర్మించనుండటంతో నగర, పరిసర ప్రాంతాల ప్రజల ఎన్నోఏళ్ళ నాటి కల నెరవేరనుంది. మాట తప్పని మడమ తిప్పని యువనేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హయాంలో ఈ కల నెరవేరటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో దీనిపై గతంలో అనేక పర్యాయాలు వినతులు ఇచ్చాం. 
– మోరు రామరాజు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, కట్టాసుబ్బారావుతోట, ఏలూరు

వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందులే
వర్షాకాలం వచ్చిందంటే చాలు భయపడాల్సి వచ్చేది. ఏ చిన్న పని కోసమైనా శనివారపు పేట కాజ్‌వే మీదుగా ఏలూరు వెళ్లా›ల్సి వచ్చేది. వర్షాకాలంలో తమ్మిలేరుకు వరదలు వచ్చి కాజ్‌వేపై భారీగా నీరు చేరేది. దీంతో ఏలూరు వెళ్లాలంటే చుట్టు తిరిగి వెళ్లాల్సి రావడంతో అనేక ఇబ్బందులు పడేవాళ్లం. ఇక్కడ వంతెన నిర్మిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– డాక్టర్‌ జయమంగళ సంతోష్‌ కుమార్, శనివారపు పేట

ఎన్నో ఉద్యమాలు చేశాం 
శనివారపుపేట కాజ్‌వేపై వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అయినా ఎవరూ పట్టించకోలేదు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చొరవతో ఎంతో కాలంగా ఉన్న సమస్య తీరనుంది. గతంలో వంతెన నిర్మిస్తామని చెబుతూనే నిధులు లభ్యత లేదంటూ దాటవేశారు. తాజాగా ఉపముఖ్యమంత్రి దీనిపై శ్రద్ధ తీసుకోవడం సంతోషంగా ఉంది.
- పిచ్చుక ఆదిశేషు, పట్టణ పేదల సంక్షేమ సంఘం నాయకులు, పత్తేబాద, ఏలూరు

మరిన్ని వార్తలు