'కోవిడ్‌' కేర్‌

4 Mar, 2020 04:26 IST|Sakshi
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉన్నాం 

రాష్ట్రంలో కోవిడ్‌ను నిరోధించేందుకు ముందస్తు చర్యలు ముమ్మరం 

ఇప్పటివరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు 

స్పెషల్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు.. 

వెంటిలేటర్లతో ప్రత్యేక వార్డులు రెడీ 

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) విషయంలో మన రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) స్పష్టం చేశారు. కోవిడ్‌ వైరస్‌ మన రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టామని, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, వివిధ ప్రాంతాల్లో అప్రమత్త స్థితిని కొనసాగిస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు, ఇతర అధికారులతో కలిసి సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో ఈనెల 2వ తేదీన కోవిడ్‌ కేసు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశామని మంత్రి చెప్పారు. ఎక్కడైనా ఈ కేసులు నమోదైనా వైద్య సేవలందించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసేందుకు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని, ప్రతి ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ విశాఖపట్నం ఎయిర్‌ పోర్టుకు వచ్చిన 6,470 మందిని పరీక్షించామని, వారిలో 263 మందిని తదుపరి వైద్య పరీక్షలకు పంపించామని చెప్పారు. ప్రతిరోజూ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామన్నారు.  

ఇంకా ఏమన్నారంటే... 
ఇప్పటివరకూ ఐసొలేషన్‌ వార్డులే ఉన్నాయి. ఇప్పుడు ఐసొలేషన్‌ రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒకే వార్డులో అందరికీ వైద్యమందిస్తే మిగతా వారికి వైరస్‌ సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఒక్కో ఆస్పత్రిలో 5 నుంచి 8 రూములు ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, నెల్లూరు, విశాఖ, గుంటూరు, కర్నూలు, కాకినాడ బోధనాస్పత్రులతో పాటు మరో రెండు జిల్లా ఆస్పత్రుల్లో ఈ ప్రత్యేక రూములు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. వెంటిలేటర్లతో కూడిన ప్రత్యేక వార్డులనూ అందుబాటులోకి తెస్తున్నాం. 

అతనితో ఎవరు ప్రయాణించారో ఆరా తీస్తున్నాం 
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి, కోవిడ్‌ వైరస్‌తో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ప్రయాణించిన బస్సులో ఏపీకి చెందిన వారెవరైనా ఉన్నారా అనేది ఆరా తీస్తున్నాం. ఆయనతో కలిసి ప్రయాణించిన వారిలో మన రాష్ట్రం వారు ఉంటే గుర్తించి తక్షణ వైద్యపరీక్షలు చేయడానికి ఆదేశించాం.  

ప్రయాణాల్ని వాయిదా వేసుకోండి 
కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం చేయాలి. వీలైనంత వరకూ జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. గ్రామ, వార్డు సచివాలయాల ఏఎన్‌ఎంలతో కరపత్రాల ద్వారా  ముందు జాగ్రత్తలపై ప్రచారం చేయిస్తున్నాం.  

కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయొచ్చు 
ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపించినా.. అనుమానం వచ్చినా  సమాచారాన్ని కాల్‌ సెంటర్‌ 0866–2410978 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పొచ్చు. వైద్య సిబ్బంది వారి దగ్గరికే వచ్చి తీసుకెళతారు. దీనికోసం ప్రత్యేక ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ కాల్‌ సెంటర్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ప్రతి జిల్లాకు నోడల్‌ అధికారి ఉంటారు. 

ఐసొలేటెడ్‌ వార్డుల్లో హెపా ఫిల్టర్లు 
కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐసొలేటెడ్‌ వార్డుల్లో హెపా (హై ఎఫిషియన్సీ పార్టిక్యులేట్‌ అరెస్టెన్స్‌) ఫిల్టర్లతో కూడిన ఎయిర్‌ కండిషన్‌ సదుపాయం కల్పిస్తున్నారు. అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలతో పాటు వైరస్‌ను కూడా ఈ ఫిల్టర్లు బంధిస్తాయి. గది నుంచి బయటకు వచ్చే గాలిలో వైరస్‌ లేకుండా ఈ ఫిల్టర్‌ అడ్డుకుంటుంది. ఒక్కో హెపా ఫిల్టర్‌ ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ఇలాంటివి ఒక్కో ఆస్పత్రిలో 8 నుంచి 10 ఏర్పాటు చేస్తే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ అవుతుంది.   

50 ఏళ్లు పైబడిన వారికి..
ఇప్పటివరకూ నమోదైన కేసుల వివరాలు చూస్తే.. 50 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా సోకుతోంది. ఇలాంటి వారే 81 శాతం ఉన్నారు. వీరికి ఇంట్లోనే వైద్యం సరిపోతుంది. మిగతా 14 శాతం మందికి ఆస్పత్రిలో వైద్యం అవసరం. మరో 5 శాతం మందికి వెంటిలేటర్‌ మీద వైద్యం అందించాల్సి ఉంది. దీనిపై కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది. దీని ప్రకారమే ముందుకు వెళుతున్నాం. కేరళలో నమోదైన మూడు కేసులూ యువకులే కావటంతో త్వరగా కోలుకున్నారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం ‘కంటెయిన్డ్‌’ పద్ధతిలో అంటే వైరస్‌ను ఎక్కడికక్కడ నిర్బంధించేలా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. 
–డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ 

ఎన్‌–95 మాస్కులు అందుబాటులో.. 
మన రాష్ట్రంలో వైరస్‌ నిరోధానికి ఉపయోగించే ఎన్‌–95 మాస్కులు 1,10,340 అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా 12,444 పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) సిద్ధంగా ఉంచాం. అన్నిరకాల మందులు అంటే యాంటీబయోటిక్స్, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచాం. ఎక్కడా మాస్కులకు గానీ, మందులకు గానీ ఇబ్బంది లేదు. 
–విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)  

మరిన్ని వార్తలు