విశాఖలో పక్కా ప్రణాళిక 

26 Mar, 2020 04:48 IST|Sakshi

రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారు

ఎక్కువ ధరలకు అమ్మితే టోల్‌ఫ్రీ నంబర్‌ 1902కు ఫిర్యాదు చేయొచ్చు

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణకు ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కోరారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఒక వాహనంపై ఒకరు మాత్రమే ప్రయాణించాలని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం ఆదేశాలిచ్చారని, ఎక్కువ ధరలకు నిత్యావసరాలను అమ్మితే టోల్‌ఫ్రీ నంబర్‌ 1902కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఎక్కువ ధరలకు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆళ్ల నాని ఇంకా ఏమన్నారంటే..

- రైతుబజార్ల వద్ద నిబంధనలు అమలు కావడం లేదనే అభిప్రాయానికి సీఎం జగన్‌ వచ్చారు. దీనివల్ల లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. రైతు బజార్లకు ప్రజలు ఒకేసారి వస్తున్నారు. అందుకే వాటిని వికేంద్రీకరించాలని నిర్ణయించారు.
- ఖాళీ ప్రదేశాల్లో ప్రజలకు 2, 3 కిలోమీటర్ల దూరంలో రైతు బజార్ల ఏర్పాటుకు నిర్ణయించాం. నిత్యావసర షాపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచాలి. ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వల్ల ప్రజలు గుమికూడ కుండా ఉంటారు. 
- నిత్యావసరాలను రవాణా చేసే హమాలీల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తాం.
- లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజల సంరక్షణ కోసమే. 
- సీఎం రోజూ సమీక్ష చేస్తూ అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను సమాయత్తం చేస్తున్నారు. పాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదు.   
-  పెద్ద వయసు ఉన్నవారి విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.  

విశాఖలో పక్కా ప్రణాళిక 
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సహకారంతో సమష్టిగా చేస్తున్న యుద్ధం ఫలిస్తోంది. రాష్ట్రంలో నమోదైన ఎనిమిది పాజిటివ్‌ కేసుల్లో మూడు విశాఖ నగరంలోనే ఉండటం, విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా అధికార యంత్రాంగంతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలను స్వయంగా పరిశీలించారు. విశాఖ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం సహా ఆస్పత్రుల్లోనూ పర్యటించారు. కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ ఎమ్మెల్సీ ఎంవీ మాధవ్‌ సైతం అభినందించారు. ఇక కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ నేతృత్వంలో జిల్లాలోని ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన 20 కమిటీలు తమకు కేటాయించిన విధులను ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాయి. 
- ఎన్‌95 మాస్క్‌లు విశాఖ నగరంలో రోజుకు సగటున 30 వేల వరకు అవసరమవుతున్నాయి. ఆళ్ల నాని ఆదేశాల మేరకు విశాఖ నగరంలోనే రోజుకు 20 వేల వరకు తయారుచేయించడానికి జీవీఎంసీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ కోటేశ్వరరావు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర సిబ్బంది కోసం 20 వేల మాస్క్‌లను రాజమహేంద్రవరం నుంచి రప్పించేందుకు ఏర్పాటు చేశారు. 
- ఇప్పటికే క్వారంటైన్‌ ఆస్పత్రిగా ఉన్న విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)ను కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిగా చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటించారు. ఈ మేరకు విమ్స్‌లో 400 బెడ్‌లతో కోవిడ్‌ బాధితుల కోసం ఏర్పాట్లు చేశారు.  

మరిన్ని వార్తలు