మిగతా రాష్ట్రాలకంటే మిన్నగా ఉన్నాం 

8 Jul, 2020 04:27 IST|Sakshi

కోవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం, ఆహారం అందిస్తున్నాం

ఎక్కడైనా సరైన ఆహారం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని  

సాక్షి, అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలోనూ, నియంత్రించడంలోనూ మిగతా రాష్ట్రాల కంటే మనం మిన్నగా ఉన్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) అన్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలోని సర్వజనాసుపత్రిని సందర్శించిన అనంతరం..కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌తో కలిసి కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... 

► టెస్టుల నిర్వహణ, ఆస్పత్రుల్లో వసతులు, క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటులో మనం ముందంజలో ఉన్నాం. 
► ప్రజలందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి ప్రతిరోజూ విజ్ఞప్తి చేస్తున్నారు. 
► కోవిడ్‌ సెంటర్లలో ఆహారం, వైద్యం బాగున్నాయి..వీటిని మరింత మెరుగుపరచుకోవచ్చు. 
► సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ కొన్ని పత్రికలు అపోహలు సృష్టిస్తుండటంతో సీఎం మమ్మల్ని స్వయంగా పరిశీలించమని చెప్పారు. 
► దీంతో విజయవాడ ఆస్పత్రిని సందర్శించగా..మెరుగైన భోజనం ఇస్తున్నట్టు తేలింది. 
► సరైనా ఆహారం అందించకపోతే కాంట్రాక్టర్లను తొలగించడమే కాదు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. 
► ఒక్కో పేషెంట్‌కు ఆహారం, మంచినీటి కోసం ప్రభుత్వం రోజుకు రూ.500 వ్యయం చేస్తోంది. 
► ఇలాంటి పరిస్థితిలో కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు. 
► ఎక్కడైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. 

మరిన్ని వార్తలు