ఇకపై మీ ఇంటి వద్దకే సేవలు : ఆళ్ల నాని

8 Jul, 2019 12:30 IST|Sakshi

సాక్షి, ఏలూరు : దశల వారీగా పింఛన్లు పెంచుకుంటూ వెళ్తామని ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల రోజుల్లోనే నెరవేర్చారని ఉప ముఖ్యమంత్రి  ఆళ్ల నాని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్‌ ఈ నెల నుంచే పింఛన్లను రూ.2250కు పెంచి ప్రతి అవ్వకు అండగా నిలిచారని ప్రశంసించారు. సోమవారం ఆయన ఏలూరులోని 25వ డివిజన్‌లో నిర్వహించిన వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ.. పింఛన్‌ అనేది పేద ప్రజలు ప్రభుత్వం నుంచి పొందే హక్కుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేశారని కొనియాడారు.  గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పింఛన్లు రాలేదని ఆరోపించారు. గత ఐదేళ్లలో పేద ప్రజలను పట్టించకోకుండా పాలన సాగించిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ముందు పెంఛన్లను రూ. 2000 పెంచారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ హామీతోనే చంద్రబాబు నాయుడు పింఛన్లను పెంచారని గుర్తుచేశారు. అవినీతిని అరికట్టేందుకై ప్రతి పథకాన్ని నేరుగా ప్రజల వద్దకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను దశల వారిగా రూ.3000 పెంచుకుంటూ వెళ్తామని ఆళ్లనాని హామి ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు