‘ఉదయం 11 తర్వాత బయటకు రావొద్దు’

29 Mar, 2020 14:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 వరకే అనుమతిస్తున్నట్టు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. నిపుణల సూచనల మేరకు సమయాన్ని కుదించినట్టు చెప్పారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. గ్రామాల్లో మాత్రం నిత్యావసరాల కొనుగోలుకు మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు ఒక్కసారిగా బయటకు రావద్దని సూచించారు. లాక్‌డౌన్‌ అమలు, తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. నిత్యావసరాలకు ఏ కొరత లేకుండా చూస్తాం. నిత్యావసర వస్తువుల విక్రయాలపై కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి షాపు వద్ద నిత్యావసర వస్తువుల ధరల పట్టిక ఏర్పాటు చేయడంతో పాటు.. కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా పట్టికలో చూపించాలి. వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దని సీఎం జగన్‌ చెప్పారు. ఎక్కడ కూడా వ్యవసాయ ధరలు పడిపోవడానికి వీల్లేదు. అందుకోసం మొబైల్స్‌ మార్కెట్స్‌ ఏర్పాటు చేస్తాం. 

గ్రామ వాలంటీర్లు సర్వేను మరింత పటిష్టంగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. అత్యవసరంగా వచ్చినా వారు ఎవరైనా క్వారంటైన్‌లో ఉంచుతాం. విదేశాల నుంచి వచ్చినవారిని పూర్తి స్థాయిలో గుర్తిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్‌ చెప్పారు. నగరాల్లో, పట్టణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు’ అని ఆళ్ల నాని తెలిపారు. 

మరిన్ని వార్తలు