గ్రేడింగ్‌, పాయింట్ల వ్యవస్థ అవాస్తవం: ఆళ్ల నాని

27 Aug, 2019 16:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆశా వర్కర్లకు పూర్తిగా రూ.10 వేల జీతాన్ని చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల వేతనాల చెల్లింపు విషయంలో వస్తోన్న పుకార్లపై ఆయన స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. వేతనాల చెల్లింపులో ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్‌ గాని, పాయింట్ల వ్యవస్థ గాని లేదన్నారు. పెరిగిన జీతాలను ఆగస్టు మొదటి నుంచి అమలు చేస్తున్నామని.. సెప్టెంబర్‌ నుంచి పెంచిన జీతాలు ఇస్తామన్నారు. బకాయి పడ్డ జీతాలను కూడా వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారన్నారు.

పాదయాత్రలో ఆశా వర్కర్ల పరిస్థితులను అర్థం చేసుకున్న జగన్‌ వారికి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఈ హామీని అమల్లోకి తీసుకు వచ్చారని ఆళ్ల నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎం జగన్‌ చేస్తూంటే ఓర్వలేక.. ప్రతిపక్షం, కొన్ని శక్తులు తప్పుడు ప్రచారంతో ఆశా వర్కర్లలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని మండి పడ్డారు. సీఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని.. ఆశా అక్కచెల్లమ్మలు దీన్ని గుర్తించాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.
(చదవండి: ఇక ప్రతివారం ‘కాఫీ టుగెదర్‌’)

మరిన్ని వార్తలు