చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు: ఆళ్ల నాని

8 Jun, 2019 19:18 IST|Sakshi

సాక్షి, ఏలూరు: తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ఆళ్ల నాని తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ... తనకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారని అన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాలలో మెరుగైన వైద్యం అందరికీ అందేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, నవరత్నాలలో మెరుగైన పథకంగా మారుస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైద్యం, ఆరోగ్యమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతలని సీఎం వైఎస్ జగన్ చెప్పారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు. 108, 104 పథకాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని.. ప్రభుత్వ ఆసుపత్రులలో అవినీతిని ని‌ర్మూలిస్తామన్నారు. పేదలందరికీ ఉచితంగా మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆళ్ల నాని హామీయిచ్చారు. (చదవండి: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు)

మరిన్ని వార్తలు