ఆ హాస్పిటల్‌ను మూసివేశాం : మంత్రి ఆళ్ల నాని

15 Jul, 2019 12:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : అవయవాల అక్రమ రవాణాపై ఇప్పటివరకు రెండు కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. అవయవాల అక్రమ రవాణాకు సంబంధించి మంత్రి శాసనమండలిలో మాట్లాడుతూ.. అవయవాల అక్రమ మార్పిడిపై విశాఖలోని శ్రద్ధ హాస్పిటల్‌, నెల్లూరులోని సింహపురి ఆస్పత్రిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. అవయవ అక్రమ మార్పిడిపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. పైగా సింహపురి హాస్పిటల్‌ కోర్టు కెళ్లే అవకాశాన్ని అధికారులే కల్పించారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. శ్రద్ధ హాస్పిటల్‌పై చర్యలు తీసుకున్నామని.. లైసెన్స్‌ రద్దు చేసి మూసివేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆగస్టు నుంచి ఆశావర్కర్లకు పెంచిన జీతాలు..
అలాగే ఆశావర్కర్లకు సంబంధించి మండలిలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు. గత ప్రభుత్వం ఆశావర్కర్లను పూర్తిగా విస్మరించిందని మంత్రి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ఆశావర్కర్ల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. జీతాలు, ఇన్సెంటీవ్స్‌ కలుపుకుని ఆశావర్కర్లకు పదివేల రూపాయలు చెల్లిస్తామని వెల్లడించారు. ఆగస్టు నుంచి ఈ పెంచిన జీతాలను వారికి అందించనున్నట్టు చెప్పారు. 

అద్దె బస్సులకు ఫిట్‌నెస్‌ లేకుంటే డిపో మేనేజర్‌పై చర్యలు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై నిపుణుల కమిటీ వేశామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గుర్తుచేశారు. సోమవారం శాసనమండలిలో ఆర్టీసీ విలీనంపై ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీనంపై ఏర్పాటు చేసిన కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వనుందని తెలిపారు. ముందుగా ఉద్యోగులను విలీనం చేయడంపై దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ఆర్టీసీలో అద్దె బస్సులను కాల పరిమితి వరకు కొనసాగిస్తామని చెప్పారు. అద్దె బస్సులకు ఫిట్‌నెస్‌ లేకపోతే డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు.
 

మరిన్ని వార్తలు