పేదల సంక్షేమమే సీఎం జగన్‌ లక్ష్యం

26 Aug, 2019 09:59 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ మాజీ కార్పొరేటర్లు

సాక్షి, ఏలూరు : రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని, ఈ ఐదేళ్లకాలంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు పక్కాగా అందించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు నగరానికి చెందిన నలుగురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో జిల్లా పార్టీ కార్యాలయం కోలాహలంగా మారిపోయింది. కోమర్తి వేణుగోపాలరావు (గోపి), రాయి విమలాదేవి, పొలిమేర దాసు, మధు రాధాబాబు నలుగురూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి ఆళ్ల నాని సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి నాని సాదరంగా ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. రాబోయే ఉగాది నాటికి రాష్ట్రంలో భారీ సంఖ్యలో 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, ఇంటికే ప్రభుత్వ పథకాలు చేరేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించటమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు అందించటంలో ప్రతి నాయకుడు, కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికీ న్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదనీ, సంక్షేమ పథకాలేవీ అమలు చేయకుండా చంద్రబాబు జనాలను పూర్తిగా మోసం చేశారని విమర్శించారు. ప్రజలకు మంచి సేవలు అందించేందుకు నాయకులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా సమన్వయకర్త పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మధ్యాహ్నపు బలరాం, బొద్దాని శ్రీనివాస్, ఎన్‌.సుధీర్‌బాబు, పల్లెం ప్రసాద్, మున్నుల జాన్‌గురునాథ్, మహిళా నేత గంపల బ్రహ్మవతి, బండారు కిరణ్, దుర్గారావు, కురెళ్ల రామ్‌ప్రసాద్, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు