వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం

3 Jun, 2020 19:31 IST|Sakshi

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

సాక్షి, విశాఖటప్నం: పాదయాత్ర సమయంలో అనకాపల్లి ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మెడికల్‌ కాలేజీని మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం ఆళ్లనాని అన్నారు. అనకాపల్లి మండలం కోడూరు, గొలగాం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. అదే విధంగా అనకాపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల కోసం ఇంత శ్రద్ధ చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. త్వరలోనే టెండర్లు ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్‌ మొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారని మంత్రి తెలిపారు. (ఉపాధ్యాయుల బదిలీకి సీఎం జగన్‌ ఆమోదం​)

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుటట్టారని పేర్కొన్నారు. 24 గంటలు పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలనేది సీఎం జగన్‌ ఆశయమని చెప్పారు. అనకాపల్లి గవర్నమెంట్ ఆ​స్పత్రిలో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు మెరుగైన వైద్య సదుపాయంతో పాటు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1060 అంబులెన్స్‌ వాహనాలు జూలైలో అన్ని మండలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించడానికి రూ.16వేల కోట్లు కేటాయించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాసు, అనకాపల్లి ఎంపీ వెంకటసత్యవతి, గుడివాడ అమర్‌నాథ్‌, కరణం ధర్మ శ్రీ, పెట్ల ఉమా శంకర్‌ గణేష్, అధికారులు పాల్గొన్నారు.

రేపు మంత్రి విజయనగరం, శ్రీకాకుళంలో పర్యటన:
డిప్యూటీ సిఎం ఆళ్ల నాని గురువారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటారు. ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని మంత్రులు ధర్మాన, బొత్స సత్యనారాయణ, పాముల‌ పుష్పశ్రీవాణిలతో కలసి పరిశీలించనున్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా చేరుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు