కాళ్లవాపు రోగులను ఆదుకోండి

26 May, 2020 03:07 IST|Sakshi
చింతూరు పెదశీతనపల్లిలో కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన వ్యక్తి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు జక్కంపూడి, ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్‌

వెంటనే వైద్య బృందాలను పంపించి చికిత్స అందించండి 

బాధితులను పరామర్శించాలని వైద్య శాఖ మంత్రికి సీఎం ఆదేశం 

యుద్ధప్రాతిపదికన ‘తూర్పు’ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించిన మంత్రి ఆళ్ల నాని 

మెరుగైన వైద్యం అందిస్తామని బాధితులకు భరోసా

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి ఘటనలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆరా తీశారు. మళ్లీ కాళ్లవాపు వ్యాధి విస్తరించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులను పరామర్శించాలని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని, అధికారులను సీఎం ఆదేశించారు. మళ్లీ ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలని, వెంటనే వైద్య బృందాలను పంపి వారికి చికిత్స అందించాలని సూచించారు.

సీఎం ఆదేశాలతో ఆళ్ల నాని, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయభాస్కర్‌తో కూడిన ప్రతినిధి బృందం యుద్ధ ప్రాతిపదికన విలీన మండలాలు.. చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో పర్యటించింది. పెదశీతనపల్లిలో ఇటీవల మృతి చెందిన మడివి గంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించింది.

ఇళ్ల ముంగిటకే వైద్యం
ఇళ్ల ముంగిటకే వైద్యం తీసుకువెళ్లేందుకు త్వరలోనే విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. చింతూరు ఏరియా ఆస్పత్రిని 50 పడకల ఆస్పతిగా అప్‌గ్రేడ్‌ చేయడం, డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాళ్ల వాపు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇంటింటా సర్వే చేసి రక్తహీనత లేకుండా పౌష్టికాహారం, శుద్ధి చేసిన నీరు సరఫరా చేస్తామన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న చింతూరులో 16 మందిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించడంతోపాటు 267 మందికి మెరుగైన వైద్యం అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు