కింగ్‌ మేకర్లం మేమే: ఎమ్మెల్యే ఆర్కే

20 Jan, 2020 15:11 IST|Sakshi

వికేంద్రీకరణ బిల్లును సమర్థిస్తున్నా

రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యం

వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటా

సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సమర్థిస్తున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుకు రాకుండా చేసిందని ఆరోపించారు. అమరావతి రాజధాని అనగానే మొదటగా సంతోషపడిన వాళ్లలో తానూ ఒకడినని, కానీ తర్వాత మోసపోయామని తెలుసుకున్నానని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అనుకూలం కాదని పర్యావరణవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కౌలు రైతు వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారని దుయ్యబట్టారు.

రాజధానిని కొంతమందికే పరిమితం చేసేలా చంద్రబాబు వ్యవహరించారని, దళిత సోదరులు అనుమతి తీసుకోకుండా భూములు లాక్కున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల నుంచి భూములు గుంజుకున్నారని తెలిపారు. కానీ సీఎం జగన్‌ ఇలా వ్యవహరించలేదని.. కమిటీ నివేదికలు, ప్రజల అభీష్టం మేరకే ముందుకు వెళ్తుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పదేళ్లు ఉండేందుకు అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్లే ఈ దౌర్భగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారని గుర్తు చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బయటపడుతుందనే భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. టీడీపీ బినామిలతో ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిలోనే శాసనసభ
శాసనాలు చేసే రాజధానిగా అమరావతి మారినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని తరలింపుపై అనుమానాలు పటాపంచలయ్యాయని తెలిపారు. శాసనసభ ఇక్కడే ఉంటుందని, కింగ్‌ మేకర్లను తామేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని స్పష్టం చేశారు. అమరావతిని అగ్రికల్చరర్‌ జోన్‌గా ప్రకటించాలని కోరారు. శాసనసభ, సచివాలయంతో సామాన్యులకు పనేం ఉండదన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు బలవంతంగా ప్రయోగించిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

చదవండి:

రాజధాని రైతులకు వరాలు

72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...

స్పీకర్‌ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం

ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?

భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన

అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా?

మరిన్ని వార్తలు