దేవుళ్ల పుట్టిల్లు

19 Jul, 2020 04:03 IST|Sakshi

శిల్పుల అడ్డా.. అహో ఆళ్లగడ్డ

దేవళాలలో మూల విరాట్‌లుగా ఆళ్లగడ్డ రాతి శిల్పాలు

విదేశాలకూ ఎగుమతులు

ఆన్‌లైన్‌ మెట్లెక్కిన అమ్మకాలు

రాతి శిల్పాలు చెక్కడం ఇక్కడి కళాకారులకు ఉలితో పెట్టిన విద్య  

రాతికి జీవం ఉట్టిపడేలా చేయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల కిందట నుంచీ వారు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది.  

ఆళ్లగడ్డ: ఏకశిల రథముపై లోకేశు వడిలోన.. ఓరచూపుల దేవి ఊరేగి వస్తుంది. శిల్పి స్పర్శ తగలగానే అక్కడి శిలలు చేతనత్వం పొంది.. సరిగమలు ఆలపిస్తాయి. కటిక రాతికి జీవకళ పోయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచీ ఆళ్లగడ్డ శిల్పులు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. నాడు ఒక కుటుంబం మాత్రమే ఈ వృత్తిని చేపట్టగా.. ప్రస్తుతం సుమారు 100 కుటుంబాలు ఇదే వృత్తిని జీవనాధారంగా చేపట్టి శిల్పకళా రంగంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరును అంతర్జాతీయ స్థాయిలో పదిలపరుస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న శేషపాన్పు విగ్రహం   

ఇలా మొదలైంది
► ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని గుంప్రామాన్‌ దిన్నె గ్రామానికి చెందిన దురుగడ్డ బాలాచారి, వీరాచారి పూర్వీకులు సుమారు 300 సంవత్సరాల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టారు. 
► పట్టణ ప్రాంతంలో ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో వీరు 1950లో అక్కడి నుంచి ఆళ్లగడ్డ పట్టణానికి వలస శిల్ప శాలను ఏర్పాటు చేశారు.
► 1982 వరకు ఆ ఒక్క కుటుంబం మాత్రమే శిల్పాలు తయారు చేసేది. ఆ తరువాత ఆ కుటుంబానికి చెందిన దురుగడ్డ రామాచారి తన నలుగురు కుమారులతోపాటు మరికొందర్ని శిష్యులుగా చేర్చుకుని శిల్పకళను అభివృద్ధి చేశారు. 
► ప్రస్తుతం ఆళ్లగడ్డలో సుమారు 60 శిల్ప శాలలు ఉండగా.. వాటిలో 500 మంది శిల్పులు విగ్రహాలు తయారు చేస్లూ జీవనోపాధి పొందుతున్నారు.

ఆళ్లగడ్డ నుంచి అమెరికా వరకు..
► దేవతా మూర్తుల విగ్రహాలలోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను జీవకళ ఉట్టి పడేలా తీర్చిదిద్దడం ఆళ్లగడ్డ శిల్పుల ప్రత్యేకత.
► వీరి చేతిలో రూపుదిద్దుకున్న అనేక విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో మూలవిరాట్‌లుగా కొలువై పూజలందుకుంటున్నాయి.
► ఇక్కడి శిల్పులు అమెరికా వెళ్లి అక్కడే మూడు నెలలు ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి వచ్చారు. 
► ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు చైనా, రష్యా, శ్రీలంక, జపాన్‌ తదితర దేశాలకు ఓడల ద్వారా ఎగుమతి అవుతున్నాయి.

మహిళలూ రాణిస్తున్నారు
► శిల్ప కళలో మహిళలు కూడా రాణిస్తున్నారు. మొదట్లో కుటుంబంలోని పురుషులు చెక్కిన విగ్రహాలకు నగిషీలు ఇవ్వటం, నునుపు చేయటం వంటి పనులు మహిళలు చేసేవారు. 
► శిల్ప కళలో మెళకువలు నేర్చుకుని పురుషులతో సమానంగా పాల రాతి శిల్పాలు, గృహాలంకరణ ఉపకరణాలను తయారు చేస్తున్నారు. 
► ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో యువకులంతా సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు మొగ్గు చూపుతుంటే.. శిల్పుల కుటుంబాల్లోని యువకులు శిల్ప కళపైనే మక్కువ చూపుతున్నారు. ► ఆన్‌లైన్‌ ద్వారా విగ్రహాల ఆర్డర్లు బుక్‌ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. శిల్పాల తయారీలో యంత్రాల వినియోగాన్ని ప్రవేశపెట్టారు. 

ఒక్కో విగ్రహానికి.. ఒక్కో శిల
► విగ్రహాలను చెక్కడం ఓ ఎత్తైతే వాటికి అవసరమైన, వినియోగదారుడి బడ్జెట్‌కు సరిపోయే రాయిని ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. 
► ఏ రాయి అయితే ఏ విగ్రహం ఎలా ఉంటుంది... ఎంత బడ్జెట్‌లో వస్తుందో చెప్పి విగ్రహాలను తయారు చేసి ఇస్తుంటారు.
► ఇందుకోసం వైఎస్సార్‌ జిల్లా తలమంచి పట్నం, మల్యాల, కాంచీపురం, బెంగళూరు, కోయిరా, మైసూర్‌ తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్, ఎర్ర రాయి, నల్ల రాయి, పాల రాయి, కోయిరా రాయి వంటి శిలలను వినియోగిస్తారు.

మరిన్ని వార్తలు