‘పొత్తు’పొడిస్తే.. పుట్టి మునిగినట్లే!

2 Apr, 2014 23:39 IST|Sakshi
‘పొత్తు’పొడిస్తే.. పుట్టి మునిగినట్లే!

తమ్ముళ్లకు బీజేపీ బెంగ
 
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆచరణసాధ్యం కాని హామీలతో ఇప్పటికే ప్రజల్లో చులకనైన చంద్రబాబు.. ఇప్పుడు పార్టీ శ్రేణులకూ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే మనుగడ లేదని గోడ మీద పిల్లుల్లా ఉన్న పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించిన బాబు తన బలం పెరిగిందనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మాటున విభజనవాదులకు సీట్లు కట్టబెట్టి నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా నిలిచిన నేతలకు హ్యాండిచ్చారు. కనీసం వారితో మాటమాత్రమైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

జిల్లాలో కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు  


 నియోజకవర్గాలు ఈ కోవకు చెందినవే. తాజాగా ఆ పార్టీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. అదే జరిగితే టీడీపీనే నమ్ముకున్న మరికొందరు నాయకులు తమ సీట్లను వదులుకోక తప్పని పరిస్థితి. ‘పొత్తు’ పొడిచినట్లయితే.. పాణ్యం, ఆలూరు, ఆదోని స్థానాలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. పాణ్యం నియోజకవర్గంలో పార్టీకి నేతలు కరువైన సమయంలో టిక్కెట్ ఇస్తాననే అధినేత హామీతో రియల్టర్ కేజే రెడ్డి పచ్చ కండువా కప్పుకున్నారు.

 ఆ తర్వాత విభజనవాది మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు. శ్రీశైలంలో ప్రజలు చీదరించుకోవడంతో ఆయన దృష్టి పాణ్యంపై పడింది. వీరిద్దరి మధ్య సీటు విషయంలో కొనసాగుతున్న పేచీ పార్టీ నాయకులు, కార్యకర్తలను సైతం గందరగోళపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదిరితే జిల్లాలో ఆ పార్టీ రెండు సీట్లు కోరనున్నట్లు తెలుస్తోంది. పాణ్యం.. కోడుమూరు.. నందికొట్కూరు.. ఆలూరు.. ఆదోని నియోజకవర్గాల్లో రెండింటిని బీజేపీ కోరుకోవచ్చనే చర్చ ఉండటంతో ఆయా స్థానాల్లో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న టీడీపీ నేతలకు కంటి మీద కునుకు దూరమవుతోంది.

 కాటసాని ఇంట్లో కమలదళం

 బీజేపీతో టీడీపీ పొత్తు అనేక మలుపులు తిరుగుతుండగానే ఆ పార్టీ ముఖ్య నేతలు పలువురు కర్నూలులోని పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో సమావేశం కావడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. బుధవారం నగరంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు.

సమావేశానంతరం బీజేపీ నేతలు కాటసానితో భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా.. టీడీపీతో పొత్తు ఖరారైతే పాణ్యం టిక్కెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను వారి ముందుంచినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కేజే రెడ్డి, ఏరాసుల రాజకీయ భవిష్యత్తు వీధిన పడినట్లే.

 ఆలూరులో నీరజ ఎటువైపో...

 బీజేపీ ఇటీవల జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఆలూరు నుంచి సదానంద, నీరజారెడ్డి పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. వారం రోజుల క్రితం వరకు ఆమె కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జైసమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఊహించని విధంగా బీజేపీ ప్రకటించిన జాబితాలో ఈమె పేరు ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

 ఒకవేళ ఇదే నిజమైతే.. బీసీ కార్డుతో టిక్కెట్ దక్కించుకున్న వీరభద్రగౌడ్ ఆశలు నీరుగారినట్లే. మరి బీసీలకు పెద్దపీట వేస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఈ సామాజిక వర్గానికి ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి.

 ఆదోనిలో మూడుముక్కలాట

 బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడైన బద్రి నారాయణప్ప తనయుడు నీలకంఠ బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ ఈయన అభ్యర్థిత్వాన్ని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్ బీజేపీలో చేరేందుకు బుధవారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.

 బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరితే ఆయన ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు భవితవ్యం మూడు ముక్కలాటగా మారింది.

మరిన్ని వార్తలు