నాడు వైఎస్సార్‌..  నేడు జగన్‌ నిధుల కేటాయింపు

14 Jul, 2019 07:47 IST|Sakshi

దేవాలయాల్లో నిత్య కైంకర్యాలకు ప్రత్యేక నిధులు

6సీ కేటగిరీలో దేవాలయాలకు వర్తింపు

జనాభా ప్రాతిపదికన ఆలయాలకు నిధులు

10 వేల జనాభా పైన ఉన్న ప్రాంతంలోని ఆలయానికి ఏటా రూ.1.20 లక్షలు

జిల్లాలో 1,110 ఆలయాలకు అవకాశం

వేదం.. మంత్రం.. దీపం.. ధూపం.. నైవేద్యాలతో ఒకప్పుడు కళకళలాడిన దేవాలయాలు ఇప్పుడు బోసిపోతున్నాయి. హిందూ సంప్రదాయ ఆస్తులైన దేవాలయాలకు పునర్జీవం పోసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గడిచిన పదేళ్లుగా ప్రభుత్వ ఆర్థిక చేయూతకు దూరమై కేవలం దాతల సహకారంతో నడుస్తున్న ఆలయాలకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించింది. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు తప్పనిసరిగా ఉండాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు కూడా సరైన ఆదాయం లేక దాతల సహకారంతో కొనసాగుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాలో వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. దేవదాయ ధర్మదాయ శాఖ అధీనంలోనే ఉన్న దేవాలయాలు జిల్లాలో 1,313 ఉన్నాయి. ఈ ఆలయాల వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని దేవదాయ శాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. ఏటా రూ.50 లక్షలపైన ఆదాయం ఉన్న దేవాలయాలను 6ఏ దేవాలయాలుగా పరిగణిస్తారు. జిల్లాలో 6ఏ కేటగిరీ దేవాలయాలు 22 ఉన్నాయి. ఏటా వార్షిక ఆదాయం రూ.2 లక్షలపైన ఉన్న దేవాలయాలు జిల్లాలో 57 ఉన్నాయి. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న 6సీ కేటగిరీ దేవాలయాలు 1,234 వరకు ఉన్నాయి. సగటున రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 124 వరకు ఉన్నాయి.

ప్రభుత్వం 6సీ కేటగిరీలో ఉన్న దేవాలయాలకు దూపధీప నైవేద్యాలకు నిధులను కేటాయించింది. మొత్తం రూ.234 కోట్లు నిధులు కేటాయించి జనాభా ప్రాతిపదికన కేటగిరీల వారీగా నిర్ణయించారు. వాస్తవానికి జిల్లాలోని దేవదాయశాఖ పరిధిలో నగరంలోని రంగనాయకస్వామి, జొన్నవాడ కామాక్షితాయి, దర్గామిట్ట రాజరాజేశ్వరి, పెంచలకోన నరసింహస్వామి, వెంకటగిరి పోలేరమ్మ, సూళ్లూరుపేట చెంగాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్ని 6ఏ, 6బీ కేటగిరీకి కిందకు వస్తాయి. వీటితో పాటు గ్రామ దేవతల ఆలయాలు మొదలుకొని పురాతన అలయాల వరకు వందల సంఖ్యలో ఆలయాలు  ఉన్నాయి. 

మూడు కేటగిరీల్లో 1,110 దేవాలయాలకు నిధుల కేటాయింపు
ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 234 కోట్లు నిధులు కేటాయించి మూడు కేటగిరీలుగా విభజించింది. గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల జనాభా ఉన్న ప్రాంతంలోని దేవాలయానికి ఏటా రూ.30 వేలు, 5 వేలు జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఆలయాలకు రూ.60 వేలు, 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతంలోని అలయాలకు 90 వేలు, 10 వేల జనాభా ఉన్న ఆలయాలకు రూ.1.20 లక్షలు ఏటా కేటాయించనున్నారు. దేవదాయ శాఖ పరిధిలో 1,234 దేవాలయాల్లో రూ.2 లక్షలపైన ఆదాయం ఉన్న 124 దేవాలయాలు మినహయిస్తే మిగిలిన దేవాలయాలు 1,110 ఉన్నాయి. వీటికి సగటున జిల్లాలో ఏటా రూ.20 కోట్ల వరకు కేటాయింపు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి పేరుకే దేవదాయ శాఖ ఆలయాలుగా ఉన్నవి వందల సంఖ్యలో ఉన్నాయి.

గడిచిన పదేళ్లుగా ఉన్న గత ప్రభుత్వాలు పూర్తిగా ధూపధీప నైవేద్యాలను పూర్తిగా విస్మరించాయి. అంతకు మునుపు 2004లో ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆ తర్వాత పాలకులు క్రమంగా ఈ పథకాన్ని అటకెక్కించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పాదయాత్రలో అనేక గ్రామాల్లో ప్రజలు ఆలయాల స్థితిని వివరించడం,  పీఠాధిపతులు, స్వామీజీలు ఆలయాల్లో నిత్యకైంకర్యాలకు ప్రభుత్వానికి సూచన చేయడంతో ఆలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇప్పటి వరకు జిల్లాలో అత్యధిక శాతం దేవదాయ శాఖ దేవాలయాలు పూర్తిస్థాయిలో దాతల సహకరాంతోనే నడుస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దీంతో దేవాలయాలు జీవ కళ సంతరించుకోనున్నాయి.
 

మరిన్ని వార్తలు