ప్రైవేట్ రంగానికి పెద్దపీట

12 Dec, 2016 15:08 IST|Sakshi
ప్రైవేట్ రంగానికి పెద్దపీట
మంత్రివర్గ సమావేశం నిర్ణయం
 సెజ్‌లు, ప్రైవేట్ పరిశ్రమలకు భూ కేటాయింపులు
 
సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ గురువారం తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఏపీఐఐసీ నుంచి భూములు తీసుకోవడం, ఇవ్వడం వంటి నిర్ణయాలు మంత్రివర్గం తీసుకున్నది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పలువురిలో చర్చకు దారి తీశాయి. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార ప్రసార శాఖల మంత్రి పల్లె రఘునాధరెడ్డి గురువారం వెల్లడించారు.
 
♦  అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమర్?ర గ్రామం సర్వే నెంబరు: 447/2లో 23.11 ఎకరాలు, పరిగి మండల కేంద్రంలో సర్వే నంబరు 451-1ఎలో 44.05 ఎకరాలు, చిత్తూరు జిల్లా వి కోట మండలం బైరుపల్లి గ్రామంలో సర్వే నంబరు 96-10, 99-1లో 7.94 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి బదలాయింపు.
 
♦  చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలం చినపందూరులో ఏపీఐఐసీకి చెందిన 200 ఎకరాల భూమిని అపోలో టైర్స్ లిమిటెడ్ కంపెనీకి కేటాయింపు. ఇక్కడ టైర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. 
 
♦ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదన మేరకు ఎప్పటికప్పుడు భూ సేకరణ కోసం తీసుకొనే రూ.ఐదువేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయం. 
 
♦  షెడ్యూల్డ్ ప్రాపర్టీలో విలువ కట్టని ఆస్తులలో హీరోమోటార్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టిన పెట్టుబడికి సేల్ డీడ్‌లో నష్టపరిహారం ష్యూరిటీ క్లాజ్‌ను చేర్చే ప్రతిపాదనకు ఏపీఐఐసీ లిమిటెడ్‌కు అనుమతి. 
 
♦  మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్‌ల గౌరవ వేతనం ఇతర భత్యాల పెంపు రెట్టింపు.
 
♦  అమరావతిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో దుబాయ్‌కి చెందిన బీఆర్ షెట్టి గ్రూప్ మెడికల్ యూనివర్శిటీ, వెయి పడకల ఆస్పత్రి, వైద్య పరికరాల తయారీ యూనిట్, నేచురోపతి సెంటర్, స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటుకు ఎకరా రూ.50 లక్షల చొప్పున 100 ఎకరాల కేటాయింపు. 
 
♦ అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ హడ్కో లేదా ఇతర సంస్థల నుంచి మూడేళ్ళలో తిరిగి చెల్లించేలా రూ.1859 కోట్ల రుణాన్ని తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడానికి ఆమోదం. 
 
 చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న పోలీస్ స్టేషన్ కోసం హోమ్ శాఖలో కొత్తగా 172 పోస్టులు మంజూరయ్యాయి. రెవెన్యూ శాఖలో డెరైక్టర్ ఆఫ్ ట్రాన్‌‌సలేషన్ పోస్ట్ మంజూరు చేశారు. ఏహెచ్‌డీడీ అండ్ ఎఫ్ శాఖకు సంబంధించి 22 పోస్టులు మంజూరు చేశారు. అందులో 11 టీచింగ్, 6 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు విజయనగరం జిల్లా గరివిడిలోని పశువైద్య కళాశాలకు మంజూరు చేశారు.
మరిన్ని వార్తలు